సోంపేట: మండలంలో పలాసపురం గ్రామంలోని బెందాళం రాజశేఖర్ ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అదే గ్రామంలో నౌపడ నారాయణకు చెందిన సెలూన్ షాప్ వద్ద ఉంచిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ ద్విచక్ర వాహనం సైతం చోరీకి గురైంది. సోంపేట సీఐ బి.మంగరాజు, ఎస్‌ఐ బి.మోహిని, క్లూస్ టీం సంఘటన స్థలాలను శనివారం పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సోంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
పూండిలో 3 తులాలు
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస నియోజకవర్గంలో వాణిజ్య, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వజ్రపుకొత్తూరు మండలం పరిధి పూండిలో శుక్రవారం దొంగతనం ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూండి సాగర్‌కాలనీలో భద్రాచలం రామకృష్ణ, మురళి అనే సోదరులు ఒకే ఇంట్లో పైన, కింద గదుల్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు అన్నదమ్ములు ఉపాధి కోసం దుబాయిలో ఉన్నారు. అయితే రాఖీ పండగ రోజున వారి భార్యలైన స్వాతి, బిందులు కలిసి స్కూటీపై చినబడాంలో ఉన్న సోదరులకు రాఖీ కట్టేందుకు ఉదయం 9.30 గంటలకి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి పైన ఇంటి తాళాలు తీసి ఉండడంతో అందోళన చెందారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బెడ్‌రూంలో బీరువ పక్కన షూట్‌కేసులో ఉన్న 3 తులాల బంగారు అభరణాలు, రూ.15 వేల నగదు అపహరణకు గురయ్యిందని గుర్తించారు. వెంటనే స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అలాగే బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా పూండిలో గత కొంతకాలంగా కేవలం మహిళలు ఉండే ఇళ్లలోనే దొంగతనాలు జరుగుతుండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింద ఇంట్లో దొంగతనం జరగకుండా పైఇంట్లో దొంగతనం జరగడం, అది కుడా కేవలం షూట్ కేసులో ఉన్న ఈ బంగారు అభరణాలు, నగదు చోరీ జరగడంతో తరుచూ ఇంటికి వచ్చి వెళ్లేవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.


