శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల తనిఖీల్లో భాగంగా శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు జిల్లా కేంద్రంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం 12.30 గంటలకు శ్రీకాకుళంలోని ఆర్డీఓ కార్యాలయం నందు గల లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను సందర్శించారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రశాంతి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ ను సందర్శించారు. నమోదైన కేసుల వివరాలు, ప్యానెల్ న్యాయవాది, పారా లీగల్ వలంటీర్లు నిర్వహిస్తున్న సేవలను, రిజిస్టర్ నిర్వహణను పరిశీలించారు. క్లినిక్‌కు వచ్చిన అభ్యర్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఆర్డీఓ ఆఫీస్ క్లినిక్‌లో రెవెన్యూ సంబంధిత సమస్యలు, భూ వివాదాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జాప్యంపై వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ప్యానెల్ న్యాయవాదికి, పారా లీగల్ వలంటీర్లకు సూచించారు. వృద్ధులకు ఉచిత న్యాయ సహాయం, సీనియర్ సిటిజన్ల హక్కుల చట్టం–2007 పై అవగాహన కల్పించారు. ప్రజలు న్యాయ సహాయం కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను లేదా జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయవాది అన్నెపు భువనేశ్వర రావు, జ్యోతి, లీగల్ వాలంటీర్లు, ఆర్డీఓ కుమారి సాయి ప్రత్యూష, ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు పాల్గొన్నారు.


