శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడల్లో జిల్లా జట్లకు ఎంపిక కావడమే కాకుండా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో 2025 –26 విద్యా సంవత్సరంలో విద్యార్థులు సాధించిన ప్రగతి, ఫలితాలు ఆధారంగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ మేరకు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, అక్కడి వ్యాయామ ఉపాధ్యాయులను శనివారం సత్కరించారు. జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా పీడీ–పీఈటీ సంఘ కోశాధికారి కె.మాధవరావు, జిల్లా గ్రిగ్స్ సెక్రటరీ టి.శ్రీనివాసరావు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు బీవీ రమణ, ఆర్.స్వాతి తదితరులు పాల్గొన్నారు.
మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన పాఠశాలలు
ఇప్పిలి జెడ్పీహెచ్ స్కూల్, శాస్త్రులపేట ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ స్కూల్, మాణిక్యపురం జెడ్పీహెచ్ స్కూల్, నరసన్నపేట జీహెచ్ స్కూల్, సింగుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.


