● మళ్లీ రోడ్డెక్కిన నడిమివలస వాసులు
జి.సిగడాం:
‘మా అందరికీ ఈ కొండే ఆధారం. మాకు భూములు లేవు, కొండమీది చెట్లు, చిన్న చిన్న వ్యవసాయ సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. కొంతమంది ఆవులు, మేకలు, గొర్రెలు ఇక్కడే మేపుతారు. మాకు కూడా ఈ కొండే జీవనాధారం. ఈ కొండ జోలికి రావద్దు’ అంటూ నడిమివలస వాసు లు మళ్లీ రోడ్డెక్కారు. నడిమివలస–గదబపాలెం గ్రామ సమీపంలో ఉన్న కొండలో సుమారుగా 202 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ కొండలో ఏపీఐఐసి పరిశ్రమ వాడగా ఏర్పాటు చేయడానికి అధికార యంత్రాంగం ముందడుగు వేసింది. సర్వే నంబర్ 36.38 లో 202 ఎకరాలపై ఉన్న రైతులు శుక్రవారం నిరసనకు దిగారు. గ్రామం సచివాలయంలో వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందించారు. ఈ కొండను ఎన్‌ఈఆర్ సివికాన్ కంపెనీకి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. తోటపల్లి, నారాయణపురం, మడ్డువలస నీరు తీసుకురావాలి గానీ ఇలా పచ్చని భూములను విధ్వంసం చేయరాదని కోరారు.
ప్రాణాలకు తెగించి కాపాడుకుంటాం
మా గ్రామంలో ఉన్న కొండ జోలికి అధికారులు వస్తే ప్రాణాలకు తెగించి మేము కాపాడుకుంటాం. ఎంతవరకై నా పోరాటాలు చేస్తాం.
– ఇజ్జిరోతు రమేష్, పోరాట కమిటీ అధ్యక్షుడు, నడిమివలస
సెంటు భూమి కూడా వదలం
మాకు గత ప్రభుత్వం హయాంలో కొండపై పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి మేమంతా సాగు చేసుకుని జీవనోపాధి సాగిస్తున్నాం. ఈ భూమి తీసుకుంటే మా ఆధారం పోతుంది. సెంటు భూమి కూడా మేము వదులుకోలేము.
– యడ్ల గౌరినాయుడు, గదబపాలెం


