అణువణువూ సమస్యలే! | - | Sakshi
Sakshi News home page

అణువణువూ సమస్యలే!

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

అణువణువూ సమస్యలే! పునరావాస కాలనీ నిర్మించాలి టెండర్‌ ప్రక్రియలో ఉంది..

ఇబ్బందులు తొలగేనా..

రణస్థలం: అణు విద్యుత్‌ కేంద్రం (న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌) ప్రతిపాదిత గ్రామమైన కొవ్వాడ సమస్యలతో సతమతమవుతోంది. ప్రాజెక్టు యాజమాన్య ప్రతినిధులు 2015, 2016 సంవత్సరాల్లో కొవ్వాడ పంచాయతీలో అణువిద్యుత్‌ కేంద్రం నిర్మిస్తామని సమావేశాలు నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని పెద కొవ్వాడ, చినకొవ్వాడ, గూడెం, రామచంద్రపురంతో పాటు టెక్కలి, జీరుకొవ్వాడ గ్రామాలు ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి. ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 4500 మంది జనాభా ఉన్నారు. కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం 2017 ఏప్రిల్‌ 30 తేదీకి కటాఫ్‌గా నిర్ణయించి అప్పటి వరకు ఉన్న యూత్‌, జనాభా, ఇళ్లకు నష్టపరిహారం చెల్లించారు. 2016లో ఈ కేంద్రం తరఫున 2061.10 ఎకరాలకు భూమి సర్వే చేశారు. అందులో సుమారు 90 శాతం భూమికి యూత్‌ ప్యాకేజీ, అర్‌అండ్‌ఆర్‌ పరిహారం చెల్లించారు. ఈ పరిహారాల చెల్లింపునకు అప్పట్లో కేంద్రం రూ.500 కోట్లు నిధులు విడుదల చేసింది. కొన్ని సమస్యల వల్ల పరిహారం కొంతమేర పెండింగ్‌లో ఉంది.

1832 మందికి పునరావాస ప్యాకేజీ

కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం నిర్వాహకులు కొవ్వాడ పంచాయతీలో 1832 మందికి పునరావాస ప్యాకేజి సర్వే చేసి నష్టపరిహారం చెల్లించారు. ఆ సమయంలో వలస వెళ్లిపోవడం, ఇతర కారణాలతో మరో 33 మందికి పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇప్పటికి ఎనిమిదేళ్లు గడుస్తున్నా పరిహారం ఊసే లేదు.

1710 ఇళ్లకు పరిహారం..

ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన 1710 ఇళ్లను గుర్తించి నష్టపరిహారం చెల్లించారు. ఇందులో కూడా 32 ఇళ్లకు పరిహారం చెల్లింపు పెండింగ్‌లో ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేకపోవడంతో కొత్తగా ఇళ్లు నిర్మిస్తే పరిహారం వస్తుందా లేదా అనే సంశయంతో కొందరు ఉన్నారు.

కానరాని అభివృద్ధి..

కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం వల్ల పూర్తిగా గ్రామాలను తొలగిస్తారనే ఉద్దేశంతో గ్రామంలో అభివృద్ధి పనులు సంవత్సరాల తరబడి నిలిపేశారు. దీంతో కాలువలు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతులు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు ఎప్పుడు నిర్మిస్తారో కానీ అభివృద్ధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ చాలామంది ఊరికి దూరంగా గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించి సీసీ రోడ్లు, కాలువలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అణువిద్యుత్‌ కేంద్రం నిర్వాహకులు ధర్మవరం వద్ద పునరావాస కాలనీని త్వరితగతిన నిర్మించాలి. కొత్తగా ఆర్‌ఆండ్‌ఆర్‌ ప్యాకేజీ, కొత్త ఇళ్లకు సైతం నష్టపరిహారం చెల్లించాలి. గతంలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించాలి. ప్రాజెక్టు ఆలస్యం వల్ల గ్రామ అభివృద్ధి లేక, బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

– అల్లిపల్లి అప్పన్న,

మాజీ సర్పంచ్‌, కొవ్వాడ పంచాయతీ

ధర్మవరం వద్ద పునరావాస కాలనీ నిర్మాణానికి సంబంధించి కన్సల్టెంట్‌ కాంట్రాక్ట్‌కు అప్పగించాం. వారు టెండర్లు పిలిచే పనిలో ఉన్నారు. ఇందు కోసం 190.07 ఎకరాలు కేటాయించాం. ఆ గ్రామానికి వెళ్లే అప్రోచ్‌ రోడ్డులో అటవీ శాఖ భూములు 49హెక్టార్లు ఉన్నాయి. ఆ భూముల బదలాయింపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ అనుమతులు కోసమే ఏళ్ల తరబడి తీవ్ర జాప్యం జరిగింది. అతి త్వరలో టెండర్‌ ప్రక్రియ పూర్తయితే పునరావాస కాలనీ నిర్మాణం ప్రారంభమవుతుంది.

– రవి కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌, ఎన్‌పీసీఐఎల్‌

పంచాయతీ పరిధిలో 18 ఏళ్లు నిండిన సీ్త్ర, పురుషులు సుమారు 650 మందికి పైగా ఉన్నారు. పునరావాస కాలనీ లేకపోవడంతో కొత్తగా పెళ్లిళ్లు అవుతున్న జంటలకు ఇళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరో 400 మంది కొత్తగా ఇళ్లు నిర్మించుకున్నారు. కొత్త ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి, కొత్తగా నిర్మించుకున్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని, పెండింగ్‌ సమస్యలు పూర్తి చేయాలని, ఎచ్చెర్ల మండలం ధర్మవరంలో పునరావాస కాలనీ త్వరితగతిన నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అభివృద్ధికి నోచుకోని కొవ్వాడ గ్రామం

భూసేకరణ, ప్రహరీ నిర్మాణంతో ఆగిన పనులు

పెండింగ్‌ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం ఎదురుచూపులు

కొత్త ఇళ్ల నిర్మాణాలకూ పరిహారం అందించాలంటున్న గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement