● వృద్ధురాలి అదృశ్యంపై దర్యాప్తు ముమ్మరం
● సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
నరసన్నపేట: జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 17న నరసన్నపేటకు వచ్చిన చిన్నమ్మడు తర్వాత ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు 19న జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఇప్పటికీ ఆమె ఆచూకీ తెలియక పోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఎవరి ఇంటికీ వెళ్లలేదని తెలియడంతో ఏదైనా ప్రమాదానికి గురైందా.. ఇతర సంఘటన జరిగిందా అని అనుమానిస్తున్నారు. పోలీసులు సైతం రెండు రోజులుగా దర్యాప్తు ముమ్మరం చేశారు. 17న నరసన్నపేట కాంప్లెక్స్‌లో బస్సు దిగిన చిన్నమ్మడు పాతబస్టాండ్, పోస్టాఫీసు, పోలీసు స్టేషన్ రోడ్డు మీదుగా ఆసుపత్రికి వెళ్లే దారిలో ఓ మహిళా న్యాయవాదిని 12 గంటల సమయంలో కలిశారు. అక్కడి నుంచే హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు చింతు శంకర్‌నారాయణతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ఆచూకీ కనిపించలేదు. గ్రామంలో చిన్నమ్మడు ఇంటికి పాలు తీసుకువెళ్లే వ్యక్తి ఎప్పట్లా 18న ఉదయం పాలు గడపలో పెట్టాడు. సాయంత్రం కూడా మళ్లీ పాలు తీసుకెళ్లగా ఉదయం పాలు అలానే ఉండటంతో అనుమానంతో గ్రామంలోనే ఉన్న సమీప బంధువు సత్యనారాయణకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఇతర కుటుంబ సభ్యులకు, కుమారులకు సమాచారం ఇవ్వగా ఎక్కడికీ రాలేదని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒంటిపై 12 తులాల ఆభరణాలు..
ఆమె ఇంటి నుంచి బయలుదేరే సమయానికి ఒంటిపై 12 తులాలకు పైగా బంగారు ఆభరణాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీటి కోసం ఎవరైనా ఏమైనా చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరసన్నపేటకు వచ్చిన ఆమె తిరిగి బస్సులో వెళ్లిన ఆనవాళ్లు కనిపించడం లేదు. పోలీసులు మెయిన్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న పలు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శుక్రవారం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రి రోడ్డులో ఒక ఇంటికి వచ్చి డాగ్‌స్క్వాడ్ ఆగింది. మేడపైకి ఎక్కి మరెక్కడికీ వెళ్లకపోవడంతో ఆ ఇంటి వద్ద ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డోన్ కెమెరాతో నరసన్నపేట పరిసరాలను పరిశీలించారు. కాగా, వృద్ధురాలి భర్త పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసి పదవీ విరమణ పొంది ఇటీవల మరణించారు. నరసన్నపేటకు చెందిన ఓ అనుమానితుడు గొట్టిపల్లికి చెందిన రెండు కార్లు అద్దెకు తీసుకొని హిరమండలం వైపు బాగిరెడ్డిపురం వరకూ వెళ్లినట్లు సాంకేతిక ఆదారాలు పోలీసులు సేకరించారు. ఆమె సమీప బంధువు సత్యనారాయణ కూడా ఏఎస్‌ఐగా పదవీ విరమణ పొందారు. పోలీసుల కుటుంబానికి చెందిన చిన్నమ్మడు ఇలా అదృశ్యం కావడంతో పోలీసులు ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పోలాకి ఎస్సైలు బి.గణేష్, అశోక్‌బాబు, అనిల్‌కుమార్, రంజిత్ తదితరులు నాలుగు బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు.


