వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస–పూండి రైల్వే స్టేషన్ పరిధిలో గరుడఖండి సమీపంలో శుక్రవా రం గుర్తు తెలియని వృద్ధురాలు (సుమారు 60 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్‌ఐ దుంపల శ్రీనివాసరావు తెలిపారు. మృతురాలు ఆకుపచ్చ జాకెట్, లేత గులాబీ రంగు చీర ధరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వివరాలు తెలిస్తే 9247585738 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.
ఇచ్ఛాపురం–జాడుపూడి రైలు నిలయం మధ్య..
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం – జాడుపూడి రైలు నిలయం మధ్య ఆఫ్‌లైన్ ట్రాక్‌లో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు తెలిపా రు. పలాస వైపు వెళ్లే మార్గంలో గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందని, పసుపు షర్ట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే పలా స జీఆర్‌పీ ఎస్సైని సంప్రదించాలని కోరారు.
‘అర్హుల పేర్లు తొలగకూడదు’
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అత్యంత పారదర్శకంగా, సమగ్రంగా జాగ్రత్తలు తీసుకుంటూ తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శ్రీకాకుళం జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి ఎం.ఎం.నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో కలిసి నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముసాయిదా జాబితా ఆధారంగా, గత జాబితాతో అనుసంధానం కాని లేదా పొరపాట్లు ఉన్న వ్యక్తులకు తక్షణమే ఈఆర్‌వో ద్వారా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు 97.27 శాతం నోటీసులను విజయవంతంగా అందజేశామని కలెక్టర్ వెల్లడించారు.


