సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో వివిధ సంస్థల్లో జరుగుతున్న అన్యాయాలపై వినతులు ఇస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్య వైఖరి మార్చుకోని పక్షంలో ఉద్యమాలు తప్పవని దళిత, ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇలిసిపురంలో అంబేడ్కర్‌ విజ్ఞాన మందిరంలో దళిత, ప్రజా సంఘాల ఐక్యవేదిక సమన్వయ సమావేశం జిల్లా కన్వీనర్‌ పేడాడ కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. దళితులు, కాంట్రాక్టు కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు, దళిత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. శ్రీకాకుళం రిమ్స్‌లో తొలగించిన 23 మంది పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పాతపట్నం అంబేడ్కర్‌ గురుకుల బాలికల పాఠశాలలో చింతల పూజ అసహజ మరణానికి కారణమైన వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, మందస మండలం కొంకడాపుట్టి గ్రామానికి చెందిన దళిత మహిళా రైతు ఉరజాన లక్ష్మి భూమిని ఆక్రమించుకున్న గ్రామ పెత్తందారుల నుంచి ఆ భూమిని స్వాధీనం చేసి ఆమెకు తిరిగి అప్పగించాలని, గార కేజీబీవీలో తొలగింపునకు గురైన కాంట్రాక్టు ప్రిన్సిపాల్‌, అకౌంటెంట్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును సమావేశం తీవ్రంగా ఖండించారు. సమావేశంలో దళిత జేఏసీ జిల్లా కన్వీనర్‌ దుర్గాసి గణేష్‌, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, జనసాహితీ జిల్లా కార్యదర్శి పి.మోహన్‌రావు, దళిత జేఏసీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్‌.అనంతరావు, ఆప్కాస్‌ జాయింట్‌ సెక్రటరీ పి.ప్రసాదరావు, అంబేడ్కర్‌ యువజన సంఘం ఇన్‌చార్జిలు రాకోటి రాంబాబు, జి.పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement