సంతబొమ్మాళి: జీతాలు చెల్లించాలంటూ మూలపేట పోర్టులో ఫోర్ వీలర్ వాహన సిబ్బంది శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మినరల్ వాటర్ ట్యాంక్, మెస్‌కు పోర్టు ఉద్యోగులు ఎవరూ వెళ్లకుండా తమ వాహనాలను అడ్డంగా పెట్టి నిరసన తెలియజేశారు.
ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, అడిగిన ప్రతి సారి కుంటి సాకులు చెప్పి పోర్టు యాజమాన్యం కాలయాపన చేస్తోందని వాహన సిబ్బంది మండిపడుతున్నారు. ఇలా మూడోసారి నిరసన వ్యక్తం చేశామని అయినా పోర్టు యాజ మాన్యం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆకలి బాధలు తెలియాలని తాగునీరు, ఆహారం పోర్టు యాజమాన్యానికి అందకుండా అడ్డంగా వాహనాలను పెట్టామని తెలిపారు. చివరికి గత్యంతరం లేక పోర్టు యాజమాన్యం ఒక రోజు గడువు కోరి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వాహన సిబ్బంది వెనుతిరిగారు.


