● పంచాయతీ రాజ్ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ● పైడిభీమవరం పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై క్షేత్రస్థాయి పరిశీలన
రణస్థలం: పైడి భీమవరంలో జరిగిన పనుల్లో డొల్లతనాన్ని ఉన్నతాధికారులు తేటతెల్లం చేశారు. మన పంచాయతీరాజ్ వ్యవస్థలో మనమే పనులు ఇలా చేస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పంచాయతీలో రూ.9.80 కోట్లు నిధుల అవకతవకలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. గత నెల 24న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి జాయింట్ డైరెక్టర్ ఎన్.రామ్‌నాథ్ రెడ్డి పరిశీలన చేశారు. ఆ సమయంలో ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్ కూటమి పాలనలో జరిగిన నిధుల స్వాహాపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో 9 మంది ఉన్నతాధికారులతో ఉన్నత స్థా యి విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మూడు బృందాలుగా ఏర్పడి బుధవారం పనులన్నీ పరిశీలించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ విజయకుమారి నేతృత్వంలో పరిశీలన జరిగింది. ముక్కుపాలవలస గ్రామీణ రోడ్డు చూసి నాణ్యత డొల్లగా ఎందుకు ఉందని ఆమె ప్రశ్నించా రు. ప్రాథమిక నిబంధనలు పాటించకుండా రోడ్డు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుతో పాటు ఇతర పనుల నాణ్యత, ఏయే మెటీరియల్ వాడారో, కొలతలు, నాణ్యత ప్రమాణాలపై పక్కా నివేదిక సమర్పించాలని క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు.
అనంతరం దేవునిపాలవలస గ్రామంలోని గెడ్డలో నిర్మించిన ప్రొటెక్షన్ వాల్‌లో నాణ్యత సక్రమంగా లేదని, ఇక్కడ సుమారు రూ. 18లక్షలు వ్యయంతో కట్టాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. ఈ గోడ ఎం బుక్ రికార్డు ప్రకారం రాసినా, ఇక్కడ వేసిన మెటీరియల్‌ల్లోనూ, నాణ్యత ప్రమాణాల్లో తేడాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అసలు ఇక్కడ వరద వచ్చిన ఫోటోలు ఉన్నాయా, ఉన్నతాధికారులు అనుమతులు తీసుకున్నారా, వాల్ ని ర్మించాల్సిన అవసరం లేనట్టు ఉందని నిలదీశారు. పంచాయతీలోని కాలువలు, సీసీ రోడ్లు, తాగునీరు ఇతరత్రా వసతులపై 10 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పరిశీలనలో విశాఖ సీఈఓ నారాయణమూర్తి, జాయింట్ డైరెక్టర్ ఎన్. రామనాథరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ రాఘరామిరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ డీఈ సత్యనారాయణ, డీడీవో(పలాస) ఎం. సతీష్, డీఎస్‌పీఓ ఏఓ చక్రవర్తి, గ్రేడ్–1 పీడీఓ తిరుపతిరావు, జూనియర్ అసిస్టెంట్ పి.లోకేశ్వరరావుతో పాటు పలువురు బృంద సభ్యులు ఉన్నారు.


