● నానాటికీ తీసికట్టుగా టెక్కలి జిల్లా ఆస్పత్రి తీరు ● సేవల లోపంపై కూటమి కార్యకర్తలే పోస్టింగులు చేస్తున్న వైనం
టెక్కలి:
‘టెక్కలి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సేవలు సరి గా అందడం లేదు.’ ఇదేమీ ప్రతిపక్షం చేసిన విమర్శ కాదు. ప్రభుత్వంలో భాగమైన కూటమికి చెందిన ఓ బీజేపీ కార్యకర్త ఆస్పత్రి సేవలపై విసిగిపోయి సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇది. కూటమి కార్యకర్తలు సైతం సమర్థించలేని స్థాయి లో ఆస్పత్రి సేవలు కునారిల్లిపోయాయి. ఇది మళ్లీ సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. ఇక్కడ జిల్లా ప్రభు త్వాస్పత్రిలో వైద్య సేవలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వస్తున్న వారు తీవ్ర అసంతృప్తితో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ఆస్పత్రి చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులే ప్రైవేట్ క్లినిక్‌లను నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే వారి సంఖ్య కంటే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య అధికంగా కనిపిస్తోంది.
●టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో నర్సింగ్ సిబ్బంది లేరు. సుమారు 10 మందికి పైగా కొరత ఉన్నారు.
●ఆస్పత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన వారికి తక్షణమే రిఫర్ చేస్తున్నారు.
●ప్రసూతి విభాగంలో కొంత మంది క్షేత్ర స్థాయి సిబ్బంది మధ్యవర్తిత్వంగా మారి డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
●గాయాలకు కట్లు కట్టే దగ్గర క్షతగాత్రుల నుంచి ముక్కు పిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు.
●రోగులకు బెడ్ షీట్లు సక్రమంగా లేకపోవడంతో పాటు గర్భిణులకు బెడ్ షీట్‌ల విషయంలో మార్పు లు చేయడం లేదు.
●ఆస్పత్రిలో థైరాయిడ్ పరీక్షలు నిర్వహించే యంత్రం నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు.
●సర్జరీ పరికరాలు శుభ్రం చేసే ఆటో క్లేవ్ సక్రమంగా పనిచేయడం లేదు. పెద్దవి మరమ్మతులకు గురయ్యాయి.
●ఆస్పత్రిలో రోగులను తరలించేందుకు వీల్ చైర్లు తీసుకువెళ్లే విషయంలో జీడీఏలు అందుబాటులో లేకపోవడంతో కొంత మంది రోగులు నేల పైనే పా కాల్సిన దుస్థితి. మరి కొంత మంది రోగుల సహాయకులే వీల్ చైర్లతో రోగులను తరలిస్తున్నారు.
●అత్యవసర మందుల కొరత ఉండడంతో పలువు రు రోగులు అవస్థలు పడుతున్నారు.
●ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పందులు, కుక్కలు సంచారం చేస్తున్నాయి..
●ఆస్పత్రిలో గత కొద్ది రోజుల క్రితం నీటి కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడిన సంఘటనలు ఉన్నాయి.
●పోస్టుమార్టం సేవల కోసం నిర్మాణం చేసిన గదిని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. దీంతో పాత ఆస్పత్రిలోనే పోస్టుమార్టం చేస్తున్నారు.


