● వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
శ్రీకాకుళం క్రైమ్:
రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను పోలీసులు తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ జగన్ పర్యటన రోజు వేలాది మంది వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారని, అదే సమయంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్‌ఐ వైపు జనాలు రావడంతో ఆమెకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని స్పష్టం చేశారు. జగన్ పర్యటనకు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వచ్చిన స్పందనకు తట్టుకోలేకే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి చేసి హత్యాయత్నం, ఇతర నాన్ బెయిల్‌బుల్ సెక్షన్లు జోడించి కేసులు నమోదు చేశారని, రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటిది మొట్టమొదటి కేసు అని అన్నారు. చింతాడ రవి శ్రీకాకుళం డీఎస్పీకి స్వచ్ఛందంగా లొంగిపోతున్నానని శనివారం ముందస్తు సమాచారమిచ్చినా.. చిలకపాలెం వద్ద మఫ్టీలో పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారన్నారు. అరెస్టు చేశాక మెజిస్ట్రేట్ ముందు హాజరు పపర్చాల్సి ఉన్నా కస్టడీలోకి తీసుకోవడం దారుణమన్నారు.
స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తున్నందునే చింతాడ రవి గొంతు నొక్కేందుకు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, అరెస్టులు చేసినంత మాత్రాన భయపడేది లేదన్నారు.


