బాహుదా తీరాన..
కొత్త టెండర్
గతంలో నూతన వంతెన నిర్మాణానికి రూ.20 కోట్లుకు టెండర్ పిలిచినప్పటికీ ముడి సరుకు ఖరీదు కావడంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పాత టెండర్ రద్దైపోయింది. మరలా కొత్త ప్రతిపాదనలతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సాధ్యమైనంత తొందరలో పాత టెండర్ స్థానంలో కొత్త టెండర్ వస్తుందని ఆశిస్తున్నాం.
– డిక్కల విక్రమ్, ఆర్‌అండ్‌బీ ఈఈ, సోంపేట
ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రజలకు కీలకమైన బాహుదా వంతెన నిర్మాణం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ కాలం 1929లో నిర్మించిన ఈ వంతెనపై.. 2023 మే 3వ తేదీన సామర్థ్యానికి మించి సుమారు 70 టన్నుల బరువుతో గ్రానైట్ కంటైనర్ వెళ్తుండగా సగభాగం కుప్పకూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన కూలిన మరుక్షణమే జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అప్పటి కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్‌తో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రత్యామ్నాయంగా తాత్కాలిక వంతెన నిర్మించేందుకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి రూ.60 లక్షలు మంజూరు చేశారు. అంతేకాకుండా అప్పటి ఆర్‌అండ్‌బీ డీఈ ఎస్.రామినాయుడు, ఇంజినీర్లు పాత వంతెన పక్కనుంచి శాశ్వత వంతెన నిర్మాణానికి సుమారు రూ.20 కోట్లతో అంచనా వేసి ప్రతిపాదనలు పంపించారు. అయితే నేటికి మూడేళ్లు దాటుతున్నా కొత్త వంతెనపై కదలిక లేదు. ప్రస్తుతం ఈ వంతెనపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు మినహా బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, మినీ వ్యానులు రాకపోకలు సాగించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
టెండర్ రద్దు చేసిన ప్రభుత్వం
కొత్త వంతెన నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.20 కోట్లుకు టెండర్ పిలిచింది. అయితే అప్పటి ముడి సరకులు ధరలు అధికంగా ఉండడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ టెండర్‌ను ఆరు నెలలు క్రితం రద్దు చేయడం స్థానికులను ఆగ్రహానికి గురి చేసింది. టెండర్ రద్దు చేసినప్పటి నుంచి కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
సామర్థ్యం ఏడాది మాత్రమే
బాహుదా పాత వంతెన సామర్థ్యాన్ని 2023 అక్టోబర్ 10వ తేదీన విశాఖపట్నంకు చెందిన ఆంధ్రా యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కె.శ్రీనివాసరావు నేతృత్వంలో బృందం పరిశీలించింది. సుమారు 94 ఏళ్లు కావడంతో మరో ఏడాది వరకు వంతెన మన్నిక వస్తుందంటూ తేల్చి చెప్పారు. అయితే నేటికి మూడేళ్లు కావస్తున్నా... అటు ప్రభుత్వం గానీ, ఇటు ప్రజాప్రతినిధులు గానీ స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


