శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి బాలబాలికల జూనియర్స్, యూత్ బాలబాలికలు బాక్సింగ్ ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంతలక్ష్మణ్‌దేవ్ (అను) తెలిపారు. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా ఉదయం 7 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. జూనియర్స్ విభాగంలో బాలబాలికలు 2010 జనవరి 1 నుంచి 2011 డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. యూత్ విభాగానికి 2008 జనవరి 1 నుంచి 2009 డిశంబర్ 31 మధ్య జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిభ కనబర్చిన వారిని త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని వెల్లడించారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోలతో హాజరుకావాలని కోరారు.
అంతా.. నా ఇష్టం!
● వరద గట్టు తవ్వేసిన మోతుబరి రైతు
ఇచ్ఛాపురం రూరల్: భారీ వరదలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట పొలాల్ని, గ్రామాన్ని కాపాడే బాహుదా నది వరద గట్టును ఓ మోతుబరి రైతు పొక్లెయినర్‌తో తవ్వించేశారు. ఈదుపురం పరివాహక ప్రాంతానికి ఆనుకొని బాహుదానది ప్రవహిస్తోంది. భారీ వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వరద నీరు పంట పొలాలు, గ్రామాన్ని ముంచెత్తకుండా ఈదుపురం–ఇచ్ఛాపురం రహదారికి ఆనుకొని లక్షల రూపాయలు వెచ్చించి వరద గట్టును అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక రైతు సాడి తులసయ్యరెడ్డి తన జీడి తోటకు వెళ్లేందుకు అనువైన రహదారి మార్గం లేదంటూ గురువారం రాత్రి పొక్లెయినర్‌తో దౌర్జన్యంగా వరద గట్టును కూల్చి వేసి రహదారిని ఏర్పాటు చేసుకున్నాడు. విషయాన్ని గ్రామస్తులు నిలదీస్తే...‘అంతా నా ఇష్టం..’ అనడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అయినా వారు మిన్నకుండిపోయా రని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద గట్టును పూర్తిగా కూల్చి వేయక ముందే అడ్డుకోవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన
శ్రీకాకుళం అర్బన్: దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్స్ రాకెట్‌లో మన దేశానికి చెందిన కొంతమంది పెద్దలు ఉన్నారని, వారి పేర్లు త్వరలో బయటకు రాను న్నాయని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇడ్లీ పైన, దోశలు పైన, ఇసీ్త్రపైన, చిన్న చిన్న ఉద్యోగస్తులపైన పన్నులు వసూలు చేసి, యుద్ధ విమానాలు కొంటోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుకే చంద్రబాబు సీఎం అని, అయితే రాష్ట్రంలో ఆ నలుగురు బ్రోకర్లే ఏపీని పరిపాలిస్తున్నారని, వాళ్లే నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, చిన్న కుటుంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడుకు నేడు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కి లేని సంపద చంద్రబాబు ఎలా సంపాదించగలిగాడని ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు షణ్ముఖరావు పాల్గొన్నారు.


