● మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతికి పలువురు సంతాపం
● ఆయన స్వగ్రామం కోటబొమ్మాళి మండలం జర్జంగి
టెక్కలి, కవిటి : వెనుకబడిన జిల్లాలో పుట్టి.. అత్యున్నత శిఖరాలు అధిరోహించి.. పుట్టిన గడ్డకు ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన హనుమంతు జగన్నాథ దొర(హెచ్‌జే దొర) మృతిపై జిల్లాలో సంతాపాలు వెల్లువెత్తాయి. కోటబొమ్మాళి మండలం జర్జంగిలో హనుమంతు సత్యనారాయణ దొర, సుశీల దంపతుల నలుగురు సంతానంలో పెద్ద కుమారుడు హెచ్.జె.దొర. ఆయన తండ్రి సత్యనారాయణ దొర 1952లో నరసన్నపేట నియోజకవర్గ ఎమ్యెల్యేగా పనిచేశారు. హెచ్‌జే దొర 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పనిచేశారు. స్వగ్రామం జర్జంగిలో హైస్కూల్ ఏర్పాటు చేయించారు. 2000 సంవత్సరంలోనే పాఠశాలకు కంప్యూటర్లు అందజేశారు. ఏటా 6 నుంచి 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదుతో పాటు ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. ప్రస్తుతం ఈయన సొంత గృహంలో జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ నిర్వహిస్తున్నారు. గ్రామంలో దేవాలయాలను నిర్మాణం చేశారు. దొర మృతిపై జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, జర్జంగి సర్పంచ్ అన్నెపు సుశీల, ఎంపీటీసీ అన్నెపు తులసీబాయి, అన్నెపు రామారావు, పూజారి వాసుదేవరావు, సంపతిరావు హేమసుందర్‌రాజు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆమదాలవలస: మాజీ డీజీపీ దొర మృతి పట్ల మాజీ స్పీకర్, మంత్రి తమ్మినేని సీతారాం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జన్మించి, పోలీసు శాఖలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి జిల్లా కీర్తి ప్రతిష్టలను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
నరసన్నపేట: ఉమ్మడి ఏపీ డీజీపీతో పాటు పలు పదవులను బాద్యతగా నిర్వహించిన వ్యక్తిగా హెచ్‌జే దొర ఎంతో గుర్తింపు పొంది జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.ఏపీ ఒలింపిక్ అసోషియేషన్ అధ్యక్షునిగా దొర పనిచేసిన సమయంలో తాను ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించానని గుర్తు చేశారు. దొర మంచి క్రీడా ప్రేమికుడని కొనియాడారు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మాజీ డీజీపీ హెచ్.జే. దొర మృతి పట్ల మాజీ కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు (లక్ష్మణరావు) సంతాపం వ్యక్తం చేశారు. దొర సాధించిన విజయాలు జిల్లాకు గర్వకారణమని కొనియాడారు.
శ్రీకాకుళం అర్బన్: దొర మృతి పట్ల డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలియజేశారు.


