● పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
● ఇచ్ఛాపురంలో పార్టీ కార్యాలయం ప్రారంభం
ఇచ్ఛాపురం:
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభోత్సవం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కృష్ణదాస్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం దయనీయస్థితికి చేరుకుందన్నారు. ఇచ్ఛాపురం సమన్వయకర్తగా ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డిని పార్టీ కార్యకర్తలంతా గెలిపించి వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రముఖ వైద్యు లు డాక్టర్ డి.త్రినాథ్ రెడ్డి వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులను ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ కేంద్రం కమిటీ సభ్యులు పిరియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్ అగర్వాలా, నర్తు నరేంద్రయాదవ్, ఉలాల భారతీదివ్య, పిలక రాజలక్ష్మి, బోర పష్ప, పైల దేవదాస్, ప్రత్తి అన్వేష్, నర్తు ప్రేమ్, తడక జోగారావు, సల్లా సుగుణ, ప్రకాశరావు పట్నాయక్, పి.రాజశేఖర్, కడియాల ప్రకాష్, వైద్యులు ఉలాల కోదండరామ్, సర్పంచ్‌లు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఏం చేశారో చెప్పగలరా..?
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ ఏం చేసిందో చెప్పగలదా. ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులయ్యారు. వారికి టీడీపీ కల్లబొల్లి కబుర్లు చెబితే కుదరదు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు ఏం చేశారో జిల్లా ప్రజలకు చెప్పాలి. కిడ్నీ రీసెర్చ్‌సెంటర్, ఉద్దానం తాగునీటి పథకం, మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసినవి. అన్ని వర్గాల వారిని ప్రభుత్వం మోసగించింది. మరోసారి వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయడానికి కార్యకర్తలంతా కృషి చేయాలి.
– తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్
ఐక్యంగా ఉండాలి
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి ఇచ్ఛాపురాన్ని గెలుచుకోవాలి. దీంతో పాటు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ విజయ కేతనం ఎగరేయాలి. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి


