ప్రజారోగ్యం కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యం కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు

Mar 7 2026 7:17 AM | Updated on Mar 7 2026 7:17 AM

సాయిరాజ్‌తో పోలీసుల వాగ్వాదం

సోంపేట: పేద ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెట్టే కుట్ర చేస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌ రెడ్డి పర్యవేక్షణలో బారువ సామాజిక ఆసుపత్రి భవన నిర్మాణ పనులను జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ సాయిరాజ్‌ శుక్రవారం పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తయినా ఈ ప్రభుత్వం పూర్తి చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు, గ్రామాల్లో హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు జరిగిందని, ఈ క్రమంలో సోంపేట మండలం రెండు సామాజిక ఆస్పత్రులకు కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. బారువ సామాజిక ఆస్పత్రికి రూ.6.6 కోట్ల నిధులు మంజూరు చేయగా 80 శాతం పనులు పూర్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు పూర్తిచేయకపోవడంతో చుట్టూ తుప్పలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక ఆస్పత్రుల వద్ద ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మెడికల్‌ కళాశాలల మాదిరిగా సామాజిక ఆసుపత్రులను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేస్తామని ఆరోగ్య శాఖమంత్రి ప్రకటనలు చేస్తున్నారని, ప్రభుత్వ బినామీలకు ఇలాంటి భవనాలు అప్పగించి పేదల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టడానికి ప్రభుత్వం పూనుకుందన్నారు. మూడుసార్లు ఎన్నికై న నియోజకవర్గ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ప్రజలు మృత్యువాత పడుతున్నారని, ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వల్లే ఈ ఘటనలు జరిగాయన్నారు.

నియోజకవర్గ సమన్వయకర్త శ్యాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తి కాగా, కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు అటకెక్కాయన్నారు. నిర్మాణాలు పూర్తయితే డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు మేలు చేకూర్చాలనే ఉద్దేశం ఉంటే ఇప్పటికై నా ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, కేంద్రమంత్రి స్పందించి పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, జెడ్పీటీసీ తడక యశోద, కంచిలి ఎంపీపీ పైలదేవదాస్‌ రెడ్డి, పార్టీ నాయకులు బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్‌, తడక జోగారావు, శిలగాన భాస్కరరావు, గురాల శ్రీను, పొడుగు కామేష్‌, వెంకటరమణ, యర్ర రజని, తామాడ పద్మావతి, పిన్నింటి ఈశ్వరరావు, నర్తు ప్రేమ్‌, పైల దేవదాస్‌రెడ్డి, కడియాల ప్రకాష్‌, సల్లా దేవదాస్‌, నాగు, బాబూరావు, ధర్మారావు, మాధవరావు, కర్రి సత్యం, అమర లోకనాథం, బుజ్జి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

ఆస్పత్రి పరిశీలనకు వెళ్తున్న పార్టీ నాయకులను సోంపేట సీఐ బి.మంగరాజు, పోలీసు సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. నిర్మాణాల పరిశీలనకు కూడా అనుమతులు కావాలా అని నాయకులు ప్రశ్నించడంతో పోలీసులు వెనుదిరిగారు. ఈ క్రమంలో పార్టీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌తో పోలీసులు వాగ్వాదానికి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement