● నాగబాబు, కూటమి నేతల తీరు సరికాదు
● వైఎస్సార్‌సీపీ యుజవన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వరూప్ మండిపాటు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లోకి వచ్చే ముందు జనసేన నాయకుడు నాగబాబు, కూటమి నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్న నాగబాబు ముందుగా జిల్లాలో జరిగిన సామాజిక అన్యాయంపై స్పందించి క్షమాపణ చెప్పాల్సిన అసవరం ఉందన్నారు. శుక్రవారం స్వరూప్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో కనీసం 5 నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాజాం, పాలకొండ నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ల వల్ల పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో కాపులు, కాళింగ సోదరులు సమానంగా ఉన్నప్పటికీ సంప్రదాయం ప్రకారం కాళింగ సామాజిక వర్గం పోటీ చేస్తోందన్నారు. మిగిలిన ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గానికి రావాల్సిన పరిస్థితి ఉందన్నారు.
గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఎచ్చెర్ల సీటును స్థానిక ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో కనీసం 400 ఓట్లు కూడా లేని ఒక సామాజిక వర్గానికి సీటు కేటాయించి కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. పెత్తందారుల కింద కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు పని చేయాలా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారని, నాగేంద్రబాబు, కూటమి నాయకులు ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ రాజకీయాలు చేయాలన్నారు. రాబోయే రోజుల్లో గొర్లె కిరణ్‌కుమార్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.


