తవ్వేది కొండంత! | - | Sakshi
Sakshi News home page

తవ్వేది కొండంత!

Mar 7 2026 7:17 AM | Updated on Mar 7 2026 7:17 AM

తవ్వేది కొండంత! అనుమతి గోరంత.. పర్యావరణంపై ప్రభావం జీడితోటలు నాశనం

కంచిలి: మండలంలోని జలంత్రకోట, బూరగాం పంచాయతీల పరిధిలో అక్రమార్కులు కొండలను మాయం చేసేస్తున్నారు. క్వారీయింగ్‌కు కొంతమేర అనుమతులు పొంది మొత్తం కొండంతా తవ్వేస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు మైన్స్‌ శాఖ నుంచి అనుమతులు పొందిన మేరకే క్వారీయింగ్‌ చేపట్టేవారు. అయితే ఇటీవల కాలంలో కొందరు క్రషర్‌ యజమానులు పూర్తిగా అనుమతులు లేకుండానే క్వారీయింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నంబర్‌ 238లోని కొండ జలంత్రకోట, బూరగాం పంచాయతీల పరిధిలో ఉంది. మొదట్లో సమీప గ్రామాల్లో ఉన్నవారు ఈ కొండలో మాన్యువల్‌ క్వారీయింగ్‌ చేసుకొని ఉపాధి పొందేవారు. తర్వాత కాలంలో ఇక్కడ నాలుగు క్రషర్లు ఏర్పడడంతో పెద్ద ఎత్తున కొండలో క్వారీయింగ్‌ చేపట్టారు. సుమారు రెండు దశాబ్దాల కాలంగా ఇక్కడ పెద్ద ఎత్తున క్వారీయింగ్‌ జరుగుతోంది. కొన్నాళ్లుగా క్వారీయింగ్‌కు తక్కువ విస్తీర్ణంలో ఫీజు కట్టి, నలుగురు క్రషర్‌ యజమానులు కొండను నాలుగు వాటాలుగా పంచుకొని నిరంతరంగా తవ్వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై జలంత్రకోట సర్పంచ్‌ ఆధ్వర్యంలో గతేడాది నిరసన తెలియజేయడంతో కొన్నాళ్లపాటు క్వారీయింగ్‌ ఆపేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ప్రారంభించారు. ఇటీవల సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాలిన నారాయణస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఈ క్వారీని సందర్శించి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.

కాలుష్యంతో ఇబ్బందులు..

బూరగాం పంచాయతీలో ఉన్న నాలుగు స్టోన్‌ క్రషర్ల వల్ల సమీప గ్రామాల్లో నివసిస్తున్నవారు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. క్రషర్లు వద్ద ఉన్న సుమారు 50 ఎకరాల జీడితోటలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. ఈ చెట్ల ఆకుల మీద స్టోన్‌ డస్ట్‌ పేరుకుపోవడంతో కాపు కాయడం మానేశాయని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తోటలు కాలుష్యంతో నాశనమవుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

సమీప గ్రామాల్లో ఆందోళన..

అక్రమ క్వారీయింగ్‌ చేస్తున్న కొండల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా రాళ్లు పేల్చుతుండడంతో సమీప గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బాంబులు పేలే సమయంలో మండల కేంద్రం కంచిలి వరకు శబ్దాలకు ఇళ్లు కంపిస్తున్నాయి. సమీప గ్రామాలైన బాసుబంజిరి, జలంత్రకోట, గొల్లకంచిలి, జెన్నాగాయి తదితర గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా మైన్స్‌ అధికారులు ఈ క్వారీలపై విచారణ చేపట్టి, ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

జలంత్రకోట పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్‌ వలన సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇక్కడ పరిమితికి మించి క్వారీయింగ్‌ చేయడం వలన పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వెంటనే వీరిపై చర్యలు చేపట్టాలి.

– సాలిన నారాయణస్వామి,

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు

జలంత్రకోట, బూరగాం పంచాయతీల పరిధిలో ఉన్న కొండలో మెటల్‌ను అక్రమంగా క్వారీయింగ్‌ చేయడం, ఆ రాళ్లను స్థానిక స్టోన్‌ క్రషర్లలో ప్రాసెస్‌ చేయడం వలన సమీప జీడితోటలు నాశనమవుతున్నాయి. చాలాకాలంగా ఇక్కడి జీడి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

– మడ్డు వెంకటరావు, జీడి రైతు, బూరగాం గ్రామం, కంచిలి మండలం

జలంత్రకోట కొండలో ఇష్టారాజ్యంగా క్వారీయింగ్‌

నాలుగు స్టోన్‌ క్రషర్‌ నిర్వాహకుల నిర్వాకం

సమీప జీడితోటలపై కాలుష్య ప్రభావం

సమీప గ్రామాల్లో భయభ్రాంతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement