కంబిరిగాంలో ‘రియల్‌’ భూదందా | - | Sakshi
Sakshi News home page

కంబిరిగాంలో ‘రియల్‌’ భూదందా

Mar 7 2026 7:17 AM | Updated on Mar 7 2026 7:17 AM

మాదర బట్టి కబ్జా

అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

పలాస: కంబిరిగాంలో మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల భూదందా శుక్రవారం వెలుగుచూసింది. వందలాది ఎకరాల పంట భూములకు సాగు నీరందించే వరహాల గెడ్డకు అనుసంధానంగా ఉన్న తుప్పల గుడ్డి వద్ద మాదర బట్టి కబ్జాకు గురైంది. రియల్‌ ఎస్టేటు వెంచర్లకు అడ్డుగా ఉందని భావించి ఆ బట్టిని కూడా అందులో కలుపుకోవడానికి ప్రయత్నించి సగం బట్టీని ఆక్రమణదారులు మట్టితో కప్పేశారు. ప్రొక్లెయినర్లతో ఆ బట్టిని కప్పేసి వారి రియల్‌ ఎస్టేటు స్థలంలో కలిపేసుకున్నారు. ఇప్పటికే భూముల విలువలు పెరగడంతో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ, పోరంబోకు, దేశబట్టిలు, వరద కాలువలను తమ కబంద హస్తాల కిందకు తెచ్చుకొని ఫ్లాట్లుగా విభజించి ఇళ్ల స్థలాలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే కంబిరిగాం గ్రామంలో కొన్ని భూములు వివాదాస్పదంగా మారడంతో పలువురు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా అదే ప్రాంతంలో కొందరు కూటమి ప్రభుత్వం అనుకూల, క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలకు సంబంధించి వరుస కథనాలు పత్రికల్లో ప్రచురితమవుతుండటంతో అధికారులు స్పందించి ఆపుతున్నా దందా ఆగకపోవడం గమనార్హం. శుక్రవారం కూడా మాదర బట్టి కబ్జాకు గురైన విషయం తెలుసుకున్న పలాస తహశీల్దారు టి.కళ్యాణ చక్రవర్తి సంబంధిత స్థలానికి వెళ్లి ఆక్రమణ నిలుపుదల చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి కాలువ కప్పివేసే పనులను అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే ఇది కంటి తుడుపు చర్యలేనని, అధికార పార్టీ అండదండలతో దందా నిరంతరాయంగా సాగుతునే ఉంటుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వరుస ఘటనలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. పెంటిభద్ర రెవెన్యూలో పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి అక్కడకు వెళ్లి వాహనాలను ఆపినా ఇంత వరకు తగిన చర్యలు తీసుకోలేదు. ఇటీవల కంబిరిగాంలో అక్రమ మట్టి, కంకర తవ్వకాలను ఆపి, వాహనాలను సీజ్‌ చేశామని చెప్పినా వాటిని చడీ చప్పుడు కాకుండా తీసుకుపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement