ఉత్తి కోతలు | - | Sakshi
Sakshi News home page

ఉత్తి కోతలు

Mar 7 2026 7:18 AM | Updated on Mar 7 2026 7:18 AM

ఉత్తి కోతలు ఎత్తి పోతలు..

ఎత్తి పోతలు..

● వంశధార ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జాప్యం

● తమ హయాంలో 40 శాతం పనులు పూర్తి చేసిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

● చంద్రబాబు ప్రభుత్వంలో పడకేసిన పనులు

● కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో మొండిచేయి

హిరమండలం: వంశధార సాగునీటి ప్రాజెక్టు వద్ద తలపెట్టిన ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. వంశధార ఫేజ్‌–2 రిజర్వాయర్‌లో నీటి స్థిరీకరణకుగాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శరవేగంగా పనులు జరిపించింది. నిధులకు లోటు లేకుండా చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వ చ్చాక పనులు సాగడం లేదు. నిధుల మంజూరు ప్రకటనలకే పరిమితమైంది. సకాలంలో బిల్లులు చెల్లించక పనులు సక్రమంగా జరగడం లేదు.

వైఎస్సార్‌ హయాంలో..

వంశధార జలాల సంపూర్ణ వినియోగానికి 2005లో వైఎస్సార్‌ ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా వంశధార రిజర్వాయర్‌ నిర్మాణానికి సంకల్పించారు. ఒక వైపు ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తూనే.. మరోవైపు వంశధార మిగులు జలాలకు సంబంధించి ఒడిశాతో వివాదాన్ని పరిష్కరించేందుకు చొరవ చూపారు. వైఎస్సార్‌ మరణానంతరం ఈ పనులు ఆగిపోయా యి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. వంశధార రిజర్వాయర్‌ పనులను పరుగులు పెట్టించడంతో పాటు నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాతో సంప్రదింపులు జరిపారు. నేరడి నిర్మాణం ఆలస్యం అవుతుండడంతో గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ నుంచి 12 టీఎంసీల నీటిని మళ్లించేందుకు వీలుగా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. 2022 సెప్టెంబరు 14న రూ.176.35 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ టెండర్లు దక్కించుకోగా.. పనులను శరవేగంగా పట్టాలెక్కించారు. పనులు కూడా వేగవంతం చేశారు. రెండేళ్లలో దాదాపు 40 శాతం పనులు చేశారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రగతి..

కేవలం రెండేళ్లలో వైఎస్సార్‌ సీపీ దాదాపు సగం పనులు పూర్తి చేసింది. చంద్రబాబు ప్రభుత్వం చొర వ చూపి ఉంటే ఈ పాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యి ఉండేది. కానీ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు. ఎత్తిపోతల పథకం పూర్తయితే కానీ రిజర్వాయర్‌లో నీరు చేరదు. మరోవైపు వంశధార రిజర్వాయర్‌ చూస్తే దాదాపు 97 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఇంకా స్పిల్‌ వే హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద గేట్లు అమర్చడం, రిజర్వాయర్‌ ఎగువ భాగంలోని వరద నీరు చేరే ప్రదేశమైన కొత్తూరు మండలం ఎన్నిరామన్నపేట వద్ద 1.5 కిలోమీటర్ల పొడవున 9 మీటర్ల ఎత్తులో మట్టి గట్టు నిర్మించాల్సి ఉంది. నిధులు మంజూరుకాక ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ఇంకా పనులు పెండింగ్‌..

రెండు ప్రభుత్వాలు కలిపి రూ.256 కోట్లు మంజూరు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల ప్రాప్తికి పనులు పూర్తయ్యాయి. అయితే కూటమి వచ్చిన తర్వాత మంజూరు చేసిన నిధుల విషయంలో ఎంత ఖర్చుచేశారు? నిధుల విడుదల ఎంత? అనేది స్పష్టత లేదు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించాల్సి ఉంది. ఇందుకుగాను రూ.9.18 కోట్లను ట్రాన్స్‌కో చెల్లించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జనరేటర్ల ఆధారంగానే ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు జరిపిస్తున్నారు. పంపు హౌస్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 3.2 మీటర్ల డయా 110 పైపులను అమర్చాల్సి ఉంది. రిజర్వాయర్‌ గట్టుపై ఎత్తిపోతల పథకానికి సంబంధించి డెలివరీ సిస్టమ్‌కు అనుమతులు రావాల్సి ఉంది. ఎత్తిపోతల పథకం పూర్తయితే కుడి, ఎడమ ప్రధాన కా లువల ద్వారా 2.11 లక్షల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. నారాయణపురం ఆనకట్ట పరిధిలో 18,577 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. హెచ్‌ఎల్‌సీ అనుసంధానం కాలువల ద్వారా మరో 5 వేల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించవచ్చు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి 1.12 టీఎంసీల తాగునీరును తరలించవచ్చు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.

నత్తనడకన సాగుతున్న గొట్టా బ్యారేజీలోని ఎత్తిపోతల పథకం పనులు

వచ్చే ఏడాదికి పనులు పూర్తి

ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. పెండింగ్‌ బిల్లుల అంశం సైతం ప్రభుత్వం దృష్టిలో ఉంది. చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా పనుల విషయంలో మాత్రం జాప్యం జరగడం లేదు. వచ్చే ఏడాది నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తాం. సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – బి.రవీంద్ర,

ఈఈ, వంశధార కన్‌స్ట్రక్షన్‌ డివిజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement