రైతన్నా.. జాగ్రత్తన్నా..!
హిరమండలం: పంటలకు క్రిమి సంహారక మందులు పిచికారీ చేసేటప్పుడు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి.సంధ్య సూచిస్తున్నారు. మందుల పిచికారీపై పూర్తిస్థాయి అవగాహన లేకుండా చేసే చిన్నచిన్న పొరపాట్లు వల్ల రైతులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పిచికారీకి నేప్ స్నేక్, తైవాన్ స్పేయర్లు మాత్రమే వాడాలి.
నేప్‌స్నేక్ స్పేయర్లుతో ఎకరానికి 12, తైవాన్ స్ప్రేయర్లుతో 8 ట్యాంకుల మందును పిచికారీ చేయాలి.
పురుగు మందులు ఉపయోగించే ముందు లేబుల్స్, వివరాల పత్రాలు చదవాలి.
నోటితో మందుల డబ్బాల మూతలు తీయకూడదు. పిచికారీ తర్వాత ఖాళీ డబ్బాలను పగలగొట్టి పూడ్చిపెట్టాలి.
మందులను చేతితో కలపకూడదు. కర్రను ఉపయోగించాలి.
పిచికారీ చేసేటప్పుడు మద్యం, పొగ తాగడం, గుట్కాలు నమలడం చేయకూడదు.
ముక్కుకు మాస్క్ లేదా పలుచటి గుడ్డ కట్టుకోవాలి.
గాలి వీచే దిశకు ఎదురుగా పిచికారీ చేయకూడదు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో పిచికారీ చేయకూడదు.
చేతులు, కాళ్లకు గాయాలు, కురుపులు ఉన్నవారు, ఆరోగ్యం సరిగా లేనివారు పిచికారీ చేయకూడదు.


