రమ్యమైన ప్రతిభ
● మెడిసిన్ చదువుతూ స్కేటింగ్‌లో రాణిస్తున్న రమ్యశ్రీ ● ఇప్పటివరకు 188 పతకాలు గెలుచుకున్న క్రీడాకారిణి
శ్రీకాకుళం:
ఆమె చదువుతున్నది వైద్య విద్య. ఎంతో పట్టుదల, దీక్ష ఉంటే తప్ప మెడిసిస్ పూర్తి చేయడం వీలు కాదు. అలాంటిది అటు మెడిసిన్, ఇటు స్పోర్ట్స్ రెండిండిలోనూ ఈ యువ కిరణం దూసుకెళ్తోంది. విశాఖపట్నంకు చెందిన రమ్యశ్రీ స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ సీటును సాధించి వైద్య విద్య ను అభ్యసిస్తోంది. ఓ వైపు చదువులో చక్కటి ప్రతిభ చూపిస్తోంది. మరో ఏడాదిలో ఎంబీబీఎస్ పూర్తి చేయనుంది. ఈ అమ్మాయి ఎల్‌కేజీ చదువుతున్నప్పటి నుంచి స్కేటింగ్ చేస్తోంది. అదే అలవాటును కొనసాగిస్తూ ఇప్పుడు ఆ ఆటలోనూ పతకాల పంట పండిస్తోంది.
ఆమె తండ్రి వివేకానంద స్వామి ఎల్జీ సర్వీస్ సెంటర్‌లో పని చేస్తుండగా, తల్లి అనూష గృహిణి. కుమార్తె స్కేటింగ్‌లో చిన్నతనం నుంచే ప్రతిభ కనబరచడంతో మరింత ప్రోత్సహించారు. రవికుమా ర్, రమణజి అనే ఇద్దరు కోచ్‌ల నేతృత్వంలో రమ్య స్కేటింగ్‌లో మెలకువలు నేర్చుకుంది. రమ్యశ్రీ ఇప్పటివరకు 188 పతకాలను సాధించింది. ఇప్పటివరకు 20 జాతీయస్థాయి ఈవెంట్లలో పాల్గొని 7 బంగారు, 7 రజత, ఏడు కాంస్య పథకాలను పొందింది. 2019 జూలై 4 నుంచి జూలై 14 వరకు యూరప్‌లో జరిగిన ప్రపంచ రోలర్ గేమ్స్‌లో పాల్గొని డౌన్ హిల్ ఈవెంట్ లో 15వ స్థానంలో నిలిచింది. భారతదేశం నుంచి ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ఏకైక మహిళగా రికార్డు సాధించింది. ప్రస్తుతం వైద్య విద్య చదువుతుండడంతో ప్రాక్టీస్ చేసేందుకు శ్రీకాకుళంలో అవకాశం లేనప్పటికీ, సెలవు రోజుల్లో ప్రాక్టీస్ చేస్తూ విశాఖపట్నంలో ఇటీవల జరిగిన జాతీయస్థాయి స్కేటింగ్ ఈవెంట్లో డౌన్ హిల్ విభాగంలో రజిత, ఆల్ ఫైన్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించి పలువురి మన్ననలు పొందింది.
ఈ సందర్భంగా రమ్యశ్రీ ‘సాక్షి’తో మాట్లాడుతూ వైద్య వృత్తిని చేపట్టినా స్కేటింగ్ కూడా కొనసాగిస్తానని, భారత దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చా టాలన్నదే తన అభిమతమని పేర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం శిక్షకుల నేర్పిన మెలకువలతో స్కేటింగ్‌లో ప్రతిభ కనబరుస్తున్నానని తెలిపింది.
ఇప్పటివరకు సాధించిన పతకాలు
రమ్యమైన ప్రతిభ
రమ్యమైన ప్రతిభ


