అంతన్నారు.. ఇంతన్నారు..!
● అరసవల్లి కూల్చివేతలకు ఏడాది ● అభివృద్ధి పేరిట నిర్మాణాలను కూల్చేసిన వైనం ● రూ.100 కోట్లు మంజూరవుతాయని హడావుడి ● ఏడాదిగా ఒక్క ఇటుకై నా వేయని దుస్థితి
ఆలయానికి చెందిన నిర్మాణాలను
కూల్చివేస్తున్న దృశ్యాలు (ఫైల్)
అరసవల్లి:
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం ఎదుట అభివృద్ధి పేరిట చేపట్టిన విధ్వంసానికి నేటికి సరిగ్గా ఏడాది గడిచింది. ఈ ఏడాది రథ సప్తమిని తొలిసారిగా రాష్ట్ర పండుగగా నిర్వహించిన కూటమి ప్రభుత్వం, రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసింది. దీనిలో భాగంగా ఆదిత్యాలయం ఎదురుగా ఉన్న పక్కా భవనాలు, షెడ్లను నేలమట్టం చేశారు. జిల్లాకు చెందిన కింజరాపు కుటుంబ నేతలే కేంద్రం, రాష్ట్రంలోనూ మంత్రులుగా చక్రం తిప్పుతుండడంతో అరసవల్లి ఆలయ రూపురేఖలు మారిపోతాయని స్థానికులు భావించారు. అయితే అనంతరం జరిగిన పరిణామాలకు భక్తులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ.. అభివృద్ధి పేరిట స్థానిక ఎమ్మెల్యేను ముందు పెట్టి మరీ దాతలిచ్చిన భవనాలను, జింకు షెడ్లను కూల్చివేయించారు. తీరా ఏడాది గడుస్తున్నా ఆయా పరిసరాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణాలను చేపట్టలేకపోయారు. దీనికి తోడు గతంలో ఉన్న శాశ్వత భవనాలకు ప్రత్యామ్నాయం చూపకుండా విధ్వంసం చేయడంతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలు, అన్నదాన ప్రసాదాల తయారీ, విక్రయాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రూ.100 కోట్లు ఎక్కడ..?
రూ.100 కోట్లతో (ప్రసాద్ స్కీమ్) కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిపోతుందని ఈ ఏడాది జరిగిన రథ సప్తమికి ముందు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడులు ప్రగల్భాలు పలికారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ను మధ్యలో పెట్టి ఆదిత్యాలయానికి ఎదురుగా ఉన్న భవనాలను కూల్చివేయించారు. అలాగే ఉన్నపళంగా దుకాణాలు ఖాళీ చేయించడంతో వ్యాపారాలను కోల్పోయి పదుల సంఖ్యలో వ్యాపారులు రోడ్డునపడ్డారు. కూల్చివేతలకు సరిగ్గా ఏడాది పూర్తవుతున్నా, ఇంతవరకు ఒక్క ఇటుక కూడా పడలేదు. ఆలయం ముందు మాత్రం విశాలంగా ప్లాట్‌ఫాం వేసి, ఇంద్ర పుష్కరిణి కనిపించేలా ఖాళీగా ఉంచారు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని పిలిగ్రమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్‌ుట్యవల్ ఆగుమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీమ్ కథ కంచికే అన్నట్లుగా స్పష్టమవుతోంది. ఆ పథకం ఎలాగో రాదు.. ఆ నెపంతో చేపట్టిన కూల్చివేతల ఘట్టాన్ని మరిపించడానికి అభివృద్ధి పేరిట ఆలయానికి చెందిన (భక్తులచే సమకూరిన ఆదాయం) నిధులు రూ.12 కోట్లను వినియోగించి ఆలయ పరిసరాల్లో కొత్త భవనాలను నిర్మించేలా తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీంతో ప్రసాద్ స్కీమ్ అటకెక్కినట్లేనన్న చర్చ జోరందుకుంది.
అరసవల్లి సూర్య దేవాలయానికి గత రెండున్నర దశాబ్ధాలుగా ఎందరో దాతలు తమ పూర్వీకుల జ్ఞాపకార్థం, తమ సంస్థల పేరిట ఎన్నో రూ.లక్షలతో వసతి గదులు, శాశ్వత నిర్మాణాలతో పాటు ఎండ, వర్షం నుంచి భక్తులకు రక్షణగా జింకు రేకు షెడ్లును కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ‘రహస్య’ అజెండా ఏముందో గానీ.. అరసవల్లిలో 2004 నుంచి దాతలు సమకూర్చిన భవనాలతో పాటు దశాబ్ధాల పూర్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వసతి గదుల సముదాయం, ఆలయ నిధులతో నిర్మించిన 12 దుకాణాల సముదాయాన్ని, ప్రసాదాల కౌంటర్లు, వంట గదులు కూడా అభివృద్ధి పేరిట కూల్చివేశారు. అలాగే ఓ దాత ఏకంగా రూ.30 లక్షలతో నిర్మించిన అన్నదాన మండపాన్ని కూడా కూల్చేశారు. అయితే దాతలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ కూల్చివేతలు చేయడంపై దాతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో దాతల సహకారం తగ్గుతుందనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆలయానికి చెందిన నిధులు, దాతలిచ్చిన విరాళాలు సుమారుగా అప్పటి మార్కెట్ రేట్ల ప్రాప్తికి సుమారు రూ.7 కోట్ల విలువైన నిర్మాణాలను కూల్చివేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు మళ్లీ ఆలయ నిధులు రూ.12 కోట్లతో అభివృద్ధి చేస్తామంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. అలాగే దుకాణాలు కోల్పోయిన వ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. రోడ్లపై బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. జీవనమార్గంగా ఉన్న దుకాణాలను తొలిగించిన క్రమంలో ఆలయ స్థలాల్లోనే కొత్తగా దుకాణాలను నిర్మించాలంటూ వ్యాపారులు కోరుతున్నారు.
అంతన్నారు.. ఇంతన్నారు..!


