ఏమైందో ఏమో..?
● పైళ్లెన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య ● జింకిభద్రలో విషాదచాయలు
సోంపేట: పైళ్లెన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన ఘటన మండలంలోని జింకిభద్ర గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తామాడ తేజేశ్వరరావు కుమారుడు షణ్ముఖరావుకు మామిడిపల్లి గ్రామానికి చెందిన గేదెల జ్యోతి కుమార్తె ఊర్మిళ(23)తో ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన వివాహమైంది. షణ్ముఖరావు సోంపేట తహసీల్దార్ కార్యాలయానికి ఎదురుగా సెల్‌షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. భార్యభర్తలు అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఊర్మిళ మూడు నెలల గర్భిణి. వారం రోజుల క్రితం షణ్ముఖరావు కుటుంబ సభ్యులు, ఊర్మిళ తల్లి జ్యోతి తీర్థయాత్రలకు వెళ్లారు. శుక్రవారం రాత్రి తీర్థయాత్రలు ముగించుకుని జింకిభద్ర గ్రామానికి చేరుకున్నారు. అనంతరం ఊర్మిళ మేడ మీద ఒక్కర్తే పడుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు శనివారం ఉదయం లేచి తలుపుకొట్టినా తీయకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డాబా పైకి వెళ్లి వెంటిలేటర్ ద్వారా చూడడంతో ఆత్యహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఊర్మిళ ఆత్మహత్య చేసుకోవడానికి భర్తే కారణమై ఉంటాడని మృతురాలి అక్క సోంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం భార్య మృతిని తట్టుకోలేక షణ్ముఖరావు అనారోగ్యానికి గురవ్వడంతో సోంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే నిజాలు తెలిసే అవకాశం ఉంది. కంచిలి ఎస్‌ఐ పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మృతితో జింకిభద్రలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఏమైందో ఏమో..?


