సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
టెక్కలి: మారుతున్న కాలంతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకునేవిధంగా ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని బీఆర్‌ఏయూ వీసీ కేఆర్ రజనీ సూచించారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆవిష్కర్ సీజన్–3 హాకథాన్ పేరుతో మూడు రోజుల పాటు జరగనున్న సాంకేతిక వర్క్‌షాప్ సదస్సును శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి సారించాలన్నారు. సాంకేతికంగా నిర్వహిస్తున్న సదస్సుల ద్వారా విద్యార్థులు మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించాలని సూచించారు. అనంతరం కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం తమ కళాశాలలో సాంకేతిక వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 10 రాష్ట్రాల నుంచి 500 మంది విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారని వెల్లడించారు. మొదటి రోజు 50 బృందాలు పాల్గొన్నాయన్నారు. వీరంతా 48 గంటల పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకుని వినూత్నమైన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ఐఐసీ డీన్ జి.సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


