జనవరి 28 నుంచి శాలిహుండం యాత్ర
● 29న వంశధార నదిలో చక్రతీర్థ స్నానం
● బ్రోచర్ ఆవిష్కరించిన ప్రతినిధులు
గార: ప్రఖ్యాత శాలిహుండం కొండపై భీష్మ ఏకాదశి పర్వదినం జరిగే గిరి జాతర బ్రోచర్‌ను ఎమ్మెల్యే గొండు శంకర్, దేవాలయ ట్రస్టీ సుగ్గు మధురెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శుక్రవారం ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. అర్చకులు మహేంద్రాడ వేణుగోపాలచార్యులు జాతర విశేషాలను వివరించారు. జనవరి 28న సాయంత్రం తిరువీధి ఉత్సవంతో జాతర ప్రారంభవుతుందని, అర్ధరాత్రి తర్వాత స్వామి మూలవిరాట్‌కు క్షీరాభిషేక సేవ ఉంటుందన్నారు. 29న ఉదయం సమీప వంశధార నదిలో చక్రతీర్థ స్నానం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 1న ఆలయం వద్ద వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవంతో జాతర ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ జి.ప్రసాదబాబు, ఎంపీపీ గొండు రఘురామ్, బడగల వెంకటప్పారావు, గుండ భాస్కరరావు, కొంక్యాణ ఆదినారాయణ, బోర లక్ష్మీ, పుక్కళ్ల నీలవేణి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.


