గంజాయి రహిత జిల్లాగా తీర్దిదిద్దుదాం: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

గంజాయి రహిత జిల్లాగా తీర్దిదిద్దుదాం: ఎస్పీ

Dec 27 2025 9:50 AM | Updated on Dec 27 2025 9:50 AM

గంజాయి రహిత జిల్లాగా తీర్దిదిద్దుదాం: ఎస్పీ

గంజాయి రహిత జిల్లాగా తీర్దిదిద్దుదాం: ఎస్పీ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘నార్కో కో–ఆర్డినేషన్‌ సెంటర్‌’ (ఎన్కార్డ్‌) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 115 గంజాయి హాట్‌ స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌, పంచాయతీ అధికారులను ఆదేశించారు. నాగావళి తీర ప్రాంతాల్లో నిఘా కోసం ప్రత్యేకంగా కెమెరాలు అమర్చుతున్నామని, సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తూ డ్రోన్లు, స్నిపర్‌ డాగ్స్‌ సాయంతో మారుమూల ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని వెల్లడించారు. విద్యార్థులకు ‘ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌’ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. మెడికల్‌ షాపుల్లో నిద్రమాత్రలు, మత్తు కలిగించే మందులను ప్రిస్క్రిప్షన్‌ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో డీ–అడిక్షన్‌ సెంటర్‌ను బలోపేతం చేస్తున్నామని, నవంబర్‌లో జిల్లాలో 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 14 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. గంజాయి విక్రేతలపైనే కాకుండా, పాత నేరస్తులపై కూడా నిరంతరం నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేంద్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పూజారాణి పుండ్కర్‌ జిల్లాలో గంజాయి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదికలు పరిశీలించారు. అరుదైన జంతువుల చర్మం, గోళ్లు, కొమ్ముల అక్రమ రవాణా జరిగితే సమాచారాన్ని చేరవేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా రవాణా అధికారి విజయ సారథి, వివిధ అధికారులు పాల్గొన్నారు.

‘సిరో’ గుర్తింపు

కొనసాగింపు

టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో శాసీ్త్రయ, పారిశ్రామిక పరిశోధన సంస్థ(సిరో) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుర్తింపును 2028 మార్చి వరకు కొనసాగించినట్లు డైరెక్టర్‌ వి.వి.నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు.శాసీ్త్రయ పరిశోధనలు, పరిశ్రమలతో అనుసంధానమైన కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.

మార్చిలోగా సమీకృత కలెక్టరేట్‌ సిద్ధం కావాలి

శ్రీకాకుళం : వచ్చే ఏడాది మార్చి 1 కల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణం పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కాంట్రాక్టర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి మంత్రి శుక్రవారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడరాదన్నారు. విభాగాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనుసంధాన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పనులపై దృష్టి సారించాలన్నారు. పర్యవేక్షణకు రోడ్ల భవనాల శాఖ నుంచి కార్యనిర్వాహక ఇంజినీరు (డీఈ) స్థాయి అధికారిని నియమించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తదితరులున్నారు.

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

బూర్జ: కొరగాం గ్రామంలో బొద్దూరు శివయ్య(63) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు రాజు, ధనలక్ష్మి. మగపిల్లలు లేక పోవడంతో ధనలక్ష్మి ముందుకొచ్చి తండ్రికి తలకొరివి పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement