74 ఎకరాల చెరువుపై కన్ను
హిరమండలం: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 75 ఎకరాల చెరువుపై కన్నేశాడు ఓ వ్యక్తి. తప్పుడు పత్రాలు చూపి కై వసం చేసుకోవాలని చూశాడు. ఏకంగా తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తీరా అధికారుల విచారణతో పాటు గ్రామస్తులు ఫిర్యాదు చేసేసరికి ఆ స్థలం చెరువుగా తేలింది. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతం కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. హిరమండలం మండలం తుంగతంపర గ్రామంలోని ఎల్పీసంఖ్య 3 సర్వే నంబర్ 1లో 52.46 ఎకరాలతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో 22 ఎకరాల్లో చెరువు ఉండేది. ఈ భూమి 22ఏలో నమోదై ఉంది. 2015లో గ్రామ అవసరాలు తీర్చేందుకుగాను విశాఖకు చెందిన జవ్వాది శ్రీరామ్మూర్తికి లీజుకు ఇచ్చారు. గ్రామాభివృద్ధికి కొంత సొమ్ము ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఐదేళ్ల తరువాత కూడా అదే వ్యక్తికి లీజు కొనసాగించారు. సదరు వ్యక్తి తప్పుడు ధ్రువీకరణపత్రాలతో హిరమండలం తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేశారు. చెరువు స్థలం మొత్తం తనదేనని.. తనకు పాస్‌పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఒక బోర్డు ఏర్పాటుచేశారు. (రాజుగారి)పెద్ద చెరవుగా పిలవబడే 74 ఎకరాల భూమి తమదేనని.. కొనుగోలు చేశామని..పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ చింతం నరసింహమూర్తితో పాటు గ్రామస్తులు తహశీల్దారు కార్యాలయంలో ఫిర్యాదుచేశారు. ఆయన పరిశీలించి అది ప్రభుత్వ భూమిగా నిర్ధారణచేశారు. అనంతరం తహసీల్ధార్‌తో పాటు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకటేష్ చెరువు భూమి కబ్జాకు ప్రయత్నించిన శ్రీరామ్మూర్తిపై కేసునమోదు చేసి అరెస్టు చేశారు. పాతపట్నం కోర్టులో శుక్రవారం హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గ్రామ అవసరాల పేరిట లీజుకు
అదే అదునుగా తనదిగా చూపుతూ స్వాధీనానికి యత్నం
గ్రామస్తుల ఫిర్యాదుతో వెలుగులోకి..
రిమాండ్‌కు నిందితుడు


