తెల్లదొరల పాలిట.. సింహస్వప్నం పుల్లెల
కలగా మిగిలిన కాంస్య విగ్రహం
● సహాయ నిరాకరణోద్యమంలో
శ్యామసుందరరావు కీలకపాత్ర
● కళింగ సీమ నుంచి నాయకత్వం
● నేడు 123వ జయంతి
ఇచ్ఛాపురం రూరల్: బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదురు నిలిచి, సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని తెల్లదొరల పక్కన బల్లెంలా మారిన పుల్లెల శ్యామసుందరరావు స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఆనాటి కుగ్రామమైన ఇచ్ఛాపురం నుంచి దేశభక్తిని గ్రామగ్రామాలకు వ్యాపింపజేసి, స్వతంత్ర భారత ఉద్యమాలకు నాయకత్వం వహించి పలుమార్లు జైలుకు వెళ్లారు. అటువంటి ధీశాలి పుల్లెల శ్యామసుందరరావు 123వ జయంతి నేడు.
గాంధీ పిలుపుతో..
1903 డిసెంబర్ 27న ఇచ్ఛాపురంలో పుల్లెల వెంకటరామయ్య పంతులు, కామేశ్వరమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించిన శ్యామసుందరరావు స్థానిక సురంగి రాజా పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించారు. సంపన్న కుటుంబం కావడంతో బరంపురం, విజయనగరం కళాశాలల్లో చదివారు. ఉన్నత విద్య కోసం మద్రాస్ చేరుకున్న సమయంలో ఆలోచనలు సాతంత్య్రోద్యమం వైపు మళ్లాయి. వాణిజ్యం పేరితో భారత దేశానికొచ్చి పెత్తనం చెలాయిస్తున్న తెల్లదొరలు తక్షణమే దేశాన్ని వెళ్లిపోవాలన్న మహాత్మాగాంధీ పిలుపు మేరకు 1921లో దేశ వ్యాప్తంగా చేపట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ‘దున్నే వాడిది భూమి’ నినాదంతో రైతు ఉద్యమానికి కళింగ సీమ నుంచి నాయకత్వం వహించిన పుల్లెల రాకతో అప్పటి వరకూ అంతంత మాత్రంగా ఉన్న కళింగసీమ స్వతంత్రోద్యమ స్ఫూర్తి ఒక్కసారిగా జూలు విదిల్చింది. అతని కృషి మొత్తం దక్షిణాది రాష్ట్రాలు శ్రీకాకుళం వైపు చూసేలా చేసింది. రైతుల అణచివేతకు కారణమైన ‘జమీందారీ విధానం రద్దు’కు పోరాటం చేశారు. 1922 ఫిబ్రవరి 8న ఆయన్ను నిర్బంధించిన బ్రిటీష్ పాలకులు బరంపురం, కడలూరు జైళ్లకు తరలించారు. విడుదలయ్యాక రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1933 నుంచి ఇచ్ఛాపురం సర్పంచ్‌గా వ్యవహరించిన పుల్లెల 1935 నుంచి జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, అవిభక్త గంజాం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, అనంతరం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1937 ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆనాటి మంత్రి సర్.ఎపి.పాత్రోను ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1940లో కిసాన్ సభకు అధ్యక్షునిగా వ్యవహరించి శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగారు. నిరంతర పోరాటాలతో తెల్లదొరలకు పక్కలో బల్లెంలా మారిన శ్యామసుందరరావును 1940లో గృహ నిర్బంధం చేశారు. ‘రద్దు’ చట్టం రాకముందే 1940 జూన్ 16న అశువులు బాశారు. ఫైర్ బ్రిగ్రేడ్‌గా పిలిచే శ్యామసుందరరావు ప్రియ శిష్యుడుగా గుర్తింపు తెచ్చుకున్న సర్దార్ గౌతు లచ్చన్న ఈయన శిష్యుడే. పుల్లెల శ్యామసుందరరావు తన కుమారుడి పేరు సైతం తన పేరునే శ్యామసుందరంగా నామకరణ చేయడం విశేషం. పుల్లెల శ్యామసుందరం జీవిత్ర చరిత్రను ప్రముఖ రచయిత ప్రొఫెసర్ డాక్టర్ కె.ముత్యం రాశారు.
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో పాత హైవేపై, శ్రీకాకుళం క్రొత్త బ్రిడ్జీ ప్రాంతంలో పుల్లెల శ్యామసుందరరావు కాంస్య విగ్రహాలను నెలకొల్పేందుకు ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పూనుకున్నారు. వివిధ కారణాల వల్ల కార్యరూపం దాల్చడం లేదు. ఏది ఏమైనా ఫైర్‌బిగ్రేడ్‌గా పేరు తెచ్చుకున్న పుల్లెల శ్యామసుందరరావు విగ్రహం ఇచ్ఛాపురం నడిబొడ్డులో ఉంటే బావితరాలకు ఆయన చరిత్ర తెలుస్తుందని అభిమానులు అంటున్నారు.
తెల్లదొరల పాలిట.. సింహస్వప్నం పుల్లెల


