బ్లాక్‌స్పాట్స్ వద్ద నిఘా పెంచాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాసీ్త్రయ దృక్పథంతో అడుగులు వేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరుగుతున్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లతో పోలిస్తే 2025లో ప్రమాదాల సంఖ్య, ప్రాణనష్టం కొంత మేర తగ్గుముఖం పట్టడం సానుకూల పరిణామమన్నారు. 2024లో 889 ప్రమాదాలు జరగ్గా.. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి ఆ సంఖ్య 699కి తగ్గిందన్నారు. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వల్లే అత్యధిక ప్రాణనష్టం జరుగుతోందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. నవభారత జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణకు ప్రణాళిక సిద్ధంగా చేయాలని ఆదేశించారు. భైరవానిపేట జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ప్రమాదకరంగా ఆపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. జనవరిని రహదారి భద్రత మాసంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా రవాణా అధికారి విజయసారథి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


