ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): త్యాగాలు, పోరాటాలు, సిద్ధాంతాల పునాదిపై ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వందేళ్లు పూర్తి చేసుకుందని పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. సీపీఐ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎన్‌ఆర్ దాసరి క్రాంతి భవన్ వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్ అధ్యక్షతన సీపీఐ శత వసంతాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆవిర్భవించిన జెండా ఎరజండా అని, నిత్యం ప్రజా సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటాలు చేసినట్లు చెప్పారు. సీపీఐ అంటే పేదలకు నీడనిచ్చే పార్టీ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందని, కమ్యూనిస్టు నాయకుల ఆశయాల కోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు చిక్కాల గోవిందరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాలరావు, టి.తిరుపతిరావు, జిల్లా సహాయ కార్యదర్శి దాసరి కిరణ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కె.అప్పలరాజు, వివిధ సంఘాల ప్రతినిధులు లక్ష్మి, పార్వతి, శిరీష, కుమారి, షేక్ బాను, పార్థసారధి, గురుమూర్తి, అర్జి మణి తదితరులు పాల్గొన్నారు.


