1104 సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి గోపాలరావు రాజీనామా
అరసవల్లి: ఆంఽధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీకాకుళం విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎం.వి. గోపాలరావు (గోపి) తన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానంలో మళ్లీ వీఎస్‌ఆర్‌కే.గణపతిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు శుక్రవారం జరిగిన రాష్ట్ర సీఈసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సంఘం నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు జరిగి, రూ.లక్షల్లో నిధులు మాయమయ్యాయంటూ కొన్ని నెలలుగా గోపాలరావుపై ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఎస్.కృష్ణయ్య అధ్యక్షతన కీలక నేతల సమావేశం ఏర్పాటు చేసి విచారణ జరిపించగా నిధుల గోల్‌మాల్ వ్యవహారాలన్నీ వాస్తవాలని తేలడంతో గోపాలరావును పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే చట్టప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో గత్యంతరం లేక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి గోపాలరావు స్వయంగా రాజీనామా సమర్పించాల్సి వచ్చింది. దీంతో పూర్వ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ఆర్‌కె గణపతినే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సభ్యులంతా ఎన్నుకున్నారు. ఇదిలావుంటే స్థానిక జిల్లాలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన గోపాలరావు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లు నియామకాల్లో అక్రమాలకు ప్రయత్నించి విధుల నుంచి సస్పెన్షన్ అయిన సంగతి తెలిసిందే.


