విద్యార్థినిపై దాడి అమానుషం
● దాడికి పాల్పడిన స్కూల్ పీడీ భర్తను అరెస్టు చేయాలి
● రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు
వాబయోగి డిమాండ్
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న
రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబయోగి, గిరిజన సంఘాల నేతలు
మెళియాపుట్టి: బందపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అక్కడ పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ భర్త రామచంద్రరావు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఘటనపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబ యోగి ఘటనపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. దాడిపై వెంటనే గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. ఒక్కరోజు వ్యవధిలో అరెస్ట్ చేయకపోతే ఆదివాసీలతో భారీ ధర్నా, ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
పాపను కొట్టిన వారిని అరెస్టు చేయాలి
పీడీ మేడమ్ భర్త డబ్బులు పోయాయని తనను కొట్టారని, తాను ఇక స్కూల్‌కు వెళ్లనని మా పాప చెబుతోంది. నేను వెళ్లి పాఠశాలలో అడిగితే హెచ్‌ఎం లేరు. అక్కడ వార్డెన్ వచ్చి నాపైనే కోప్పడ్డారు. ఇక్కడ గొడవపడితే మంచిది కాదని నన్ను బెదిరించారు.
– గూడపు గాయిత్రి, విద్యార్థిని తల్లి
విద్యార్థినిపై దాడి అమానుషం


