గంజాయి డాన్ అరెస్ట్
విజయనగరం క్రైమ్: గంజాయి రవాణాలో డాన్‌గా వ్యవహరిస్తున్న పఠాన్ బాషా అలీని విజయనగరం టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ రావు, ఎస్సై కృష్ణమూర్తి పఠాన్ బాషా ఆలీనీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం, కొత్తవీధికి చెందిన పఠాన్ బాషా అలీ (31) విజయనగరంలోని ఫూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాను మార్గంగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆలీపై నాలుగు కేసులు నమోదయ్యాయి. విజయనగరం టూ టౌన్ పీఎస్ పరిధి బాబామెట్ట ప్రాంతంలో గత ఏడాది 10 కిలోల గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పాటు మరో కేసులో 3.10 కిలోల గంజాయితో పట్టుబడగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో 2021లో గంట్యాడ పీఎస్ లో 1596.36 కిలోలు, 2023లో బాపట్ల జిల్లా నిజాంపట్నం పీఎస్ పరిధిలో 1.5 కిలోలల గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా తేలింది. దీంతో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.


