మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం
శ్రీకాకుళం/శ్రీకాకుళం పీఎన్‌కాలనీ : మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మనుస్మృతి దహనం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో గురువారం దళిత, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కె.ధర్మారావు, డి.గణేష్ అధ్యక్షతన ‘సనాతన సంస్కృతి –ప్రజాస్వామ్యం‘ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన సీనియర్ న్యాయవాది జహా ఆరా మాట్లాడుతూ దళిత, ఆదివాసీ, ముస్లిం మైనారిటీల వ్యతిరేక పాలకుల వ్యవస్థలో బతుకుతున్నామని.. మను సంస్కృతి రాజ్యమేలుతున్న పాలనలో ఉన్నామని చెప్పారు. చరిత్రను మతకోణంలో చూడడం సరికాదన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం జరగకపోతే రాజకీయ న్యాయం, అధికారం రాదని అంబేడ్కర్ పేర్కొన్నారని, దళిత, మైనారిటీ, పీడిత ప్రజలు మనువాదానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయ, ప్రజాసంఘాల ప్రతినిధులు మిస్క కృష్ణయ్య, సన్నశెట్టి రాజశేఖర్, పేడాడ కృష్ణారావు, గొంటి గిరిధర్, కల్లేపల్లి రామ్‌గోపాల్, బోనెల రమేష్, పి.మోహన్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు బి.అప్పారావు, బి.వి.రమణ, నేతల అప్పారావు, దమయంతి, చిన్నికృష్ణ, యడ్ల జానకిరావు, గరికివాడు, బెలమర ప్రభాకర్, రాయి సూర్యనారాయణ, కుర్మారావు, శ్రీనివాస్, యడ్ల గోపి, రాజేశ్వరి, గోవింద్, తేజ, కళావతమ్మ, బడే కామరాజు, అనంతరావు, గణపతి, రాముడు, మహేంద్ర, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.


