బొమ్మిక.. సాగునీరు లేక!
బూర్జ : మండల పరిధిలోని బొమ్మిక రిజర్వాయర్ ద్వారా ఈ ఏడాది రబీ పంటలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. 1980లో అప్పటి ప్రభుత్వం మెట్ట ప్రాంత రైతుల కోసం బూర్జ మండలం పెద్దపేట పంచాయతీ బొమ్మిక గిరిజన గ్రామం ఎగువన బొమ్మిక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. బొమ్మిక చుట్టుపక్కల కొండల్లోని నీటిని నిల్వ చేసి దిగువ భాగాన ఉన్న పెద్దపేట, మదనాపురం, జగన్నాథపురం, బొమ్మిక, కొండపేట, నీలాపురం, ఏ.పి.పేట తదితర గ్రామాల పరిధిలోని 770 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. 2015–16లో రిజర్వాయర్‌తోపాటు కాలువల ఆధునీకరణ పనులకు రూ.9 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టారు. మళ్లీ ఈ ఏడాది తూతూమంత్రంగా రిజర్వాయర్‌లో పిచ్చిమొక్కలు, పూడికలు తొలగించారు. కాలువల్లో పనులు చేపట్టినా ప్రస్తుతం రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో రబీ పంటల సాగుకు శివారు గ్రామాలకు నీరు అందడం ప్రశ్నార్థకమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో ఆధునీకరణ పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
బొమ్మిక రిజర్వాయర్‌లో సగానికి తగ్గిన నీరు
రబీ పంటలకు సాగునీరు ప్రశ్నార్థకం
తూతూమంత్రంగా పూడిక తీతలు
బొమ్మిక.. సాగునీరు లేక!


