వేర్వేరు బావుల్లో పడి ఇద్దరు మృతి
మెళియాపుట్టి : మెళియాపుట్టిలోని ఓ బావిలో వృద్ధురాలి మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమైంది. మృతురాలు అదే గ్రామానికి కొల్లి మాణిక్యం (67)గా గుర్తించారు. మాణిక్యం భర్త కొన్నేళ్ల క్రితమే విడిచిపెట్టి వెళ్లిపోవడంతో కుమార్తెను పెంచి పెళ్లి చేసింది. అనంతరం మతిస్థిమితం సరిగ్గా లేక పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ క్రమంలో మెళియాపుట్టి మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న బావిలో మాణిక్యం మృతదేహాన్ని అక్క కొడుకు నక్కల కిరణ్ గురువారం గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బావికి స్నానానికి వెళ్లి పొరపాటున పడిపోయి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు.
పొందూరులో..
పొందూరు: స్థానిక నాగవంశం వీధికి చెందిన నల్లి సురేష్(40) పొందూరులోని బండార్లమ్మ చెట్టు సమీపంలోని బావిలో శవమై తేలాడు. వివరాల్లోకి వెళ్తే.. సురేష్ ఈ నెల 22న తెల్లవారుజామున నిద్ర లేచి బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఏం జరిగిందో గాని గురువారం స్థానిక బావిలో సురేష్ మృతదేహం తేలింది. కొద్ది రోజులుగా మతి స్థిమితం లేకుండా ఉన్నాడని, పచ్చకామెర్లతో బాధపడుతున్నాడని, మద్యం ఎక్కువగా తాగేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.చెప్పారు.
వేర్వేరు బావుల్లో పడి ఇద్దరు మృతి


