ఎంఐఎస్ కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గం ఎన్నిక
టెక్కలి: మండల విద్యా శాఖా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ (మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్) కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం టెక్కలిలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా పి.మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కె.ఉపేంద్ర, ఆర్థిక కార్యదర్శిగా బి.రామ్‌ప్రసాద్, ఉపాధ్యక్షులుగా బి.శశిరేఖదేవి, సహాయ కార్యదర్శిగా ఆర్.సంతోష్‌కుమార్, గౌరవ సలహాదారుడిగా ఎస్.గౌరీశంకర్, డి.సిహెచ్.రాంబాబు, సభ్యులుగా జి.చంద్రశేఖర్, వై.లింగరాజు, ఎస్.కళ్యాణి, పి.విజయ్ తదితరులను ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా కృషి చేయాలని నినాదాలు చేశారు.
శ్రీముఖలింగంలో మరుగుదొడ్లకు మరమ్మతులు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో భక్తులకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు వినియోగంలోకి తెచ్చేందుకు రూ.15 లక్షలతో మరమ్మతులు చేయిస్తున్నామని కేంద్ర పురావస్తు శాఖ సీఏ మూర్తి గురువారం తెలిపారు. ‘శివ..శివా’ అనే శీర్షికన ఈనెల 1న సాక్షి లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. ఢిల్లీలోని శాఖ ఉన్నతాధికారుల అనుమతితో పనులు చేయిస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్లు చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వివాహం.. వివాదం.. రాజీ
ఇచ్ఛాపురం రూరల్: ఎక్కడో కర్నాటక నుంచి ఇచ్ఛాపురం వచ్చి ఎదురు కట్నం ఇచ్చి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, పెళ్లయ్యాక వధువు ట్రైన్ దిగి ఇంటికి వచ్చేయడం, వరుడు వధువు ఇంటికి వచ్చి తన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని కోరడం వంటి వరుస ఘటనలతో ఇచ్ఛాపురం ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. ఇచ్చాపురం మండలం భవానీపురంలో నివాసం ఉంటున్న ఓ యువతిని కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన నాగిరెడ్డి సురేష్ రెడ్డి ఈ నెల 17న సోంపేటలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. 19వ తేదీన పలాసలో వధూవరులు కర్నాటక వెళ్లేందుకు ట్రైన్ ఎక్కారు. విజయనగరం రైల్వేస్టేషన్‌కు వచ్చే సరికి వధువు కనిపించలేదు. దీంతో ఆయన అంతా వెతికి ఇచ్ఛాపురం రాగా యువతి ఆమె ఇంటిలోనే కనిపించడంతో నిశ్చేష్టుడయ్యాడు. పెళ్లి తనకు ఇష్టం లేదని వధువు చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి గురువారం రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఇరు వర్గాల వారు రాజీకి వచ్చేయడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
ఎంఐఎస్ కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గం ఎన్నిక


