పైడిగాంపై నిర్లక్ష్యమేలా..?
అన్నదాతల ఆక్రందనలు పట్టించుకోని ప్రభుత్వం
మూడు మండలాల రైతులకు సాగునీటి కష్టాలు
5 వేల ఎకరాలకు గ్యారెంటీ లేని పరిస్థితి
తప్పని అవస్థలు
కంచిలి: ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో మూడు మండలాల రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి ఉద్దేశించి నిర్మించిన చారిత్రాత్మక సాగునీటి ప్రాజెక్టు నిర్లక్ష్యపు నీడన కొట్టుమిట్టాడుతోంది. వంశధార జలాలను జిల్లా శివారులో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గానికి తెస్తామని చెప్పే ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్న పురాతనమైన శాశ్వత ప్రాజెక్టు మాట గుర్తులేకపోవడం శోచనీయమని చెప్పాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న పైడిగాం ప్రాజెక్టు నేడు నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ ప్రాజెక్టు సాధన కోసం సోంపేట సమితి మాజీ అధ్యక్షుడు దివంగత గన్ని పద్మనాభరావు ఎన్నో పోరాటాలు చేశారు. చివరికి 1957లో సోంపేట మండలం బేసి రామచంద్రాపురం గ్రామంలో మహాసభను నిర్వహించడంతో, ఆ సభకు నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హాజరై.. రైతుల స్పందన చూసి అప్పటికప్పుడు మంజూరు చేశారు. దీంతో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. దీని నిర్మాణం కోసం గన్ని పద్మనాభరావు ఎంతగానో కృషిచేసి, పూర్తి చేయించిన విషయం స్థానిక రైతులకు చరిత్రగా గుర్తుంది.
ఎండుతున్న ఆయకట్టు భూములు
ఇంతటి చరిత్ర కలిగిన ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆయకట్టు భూములకు ప్రస్తుతం నీరందని దుస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు పరిధిలో 4,894 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. ఇందులో కంచిలి మండల పరిధిలో ఆరు గ్రామాలు, సోంపేట మండలంలో 18 గ్రామాలు, మందస మండలంలో ఒక గ్రామంలో ఆయకట్టు భూములన్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో పంట పొలాలకు నీరు వెళ్లేందుకు 16.8 కిలోమీటర్ల మెయిన్ కెనాల్‌ను, 14 బ్రాంచ్ కెనాల్స్ ద్వారా 23.75 కిలోమీటర్లు వరకు నిర్మించారు. కానీ మెయిన్ చానల్‌ను పూర్తిస్థాయిలో సిమెంటు నిర్మాణంగా చేపట్టలేదు. కేవలం రామకృష్ణాపురం గ్రామం వరకు సిమెంట్ లైనింగ్ వేసి, తర్వాత విడిచిపెట్టేశారు. దీనివలన ప్రాజెక్టు నుంచి విడిచిపెట్టినా నీరు చివరి ఆయకట్టు వరకు సక్రమంగా రాని దుస్థితి ఏర్పడింది. కెనాల్ కూడా చాలా కాలంగా పూడిక తీయకపోవడంతో మెయిన్ కెనాల్‌కు ఆనుకొని ఉన్న పొలాలకు కూడా సక్రమంగా నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక బ్రాంచ్ కెనాల్స్ పరిధిలో ఉన్న భూముల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నీరు సోంపేట మండలం పలాసపురం వరకు వెళ్తుంది. ఈ శివారు భూములకు ఎప్పుడు కూడా నీరు సరిగా వెళ్లకపోవడంతో ఆయకట్టు పొలాలు సాగునీటి కోసం ఇబ్బందులు పడటం ప్రతి ఏడాది కన్పిస్తోంది. కానీ ఈ పొలాల రైతుల నుంచి మాత్రం ఖచ్చితంగా శిస్తు వసూలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. తితిలీ తుఫాను ధాటికి దెబ్బతిన్న ఈ ప్రాజెక్టును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.20 లక్షలతో తాత్కాలిక మరమ్మతుల పనులు చేపట్టారు. అయితే ఆ తర్వాత శాశ్వత మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవడంతో ఆయకట్టు రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
సీఎం చంద్రబాబుకు లేఖ
పైడిగాం ప్రాజెక్టు పూర్తిగా శిథిలావస్థలకు చేరినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై ఈ ప్రాజెక్టు పోరాటయోధుడు, మాజీ సమితి అధ్యక్షుడు గన్ని పద్మనాభరావు కుమారుడు గన్ని అశోక్‌కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. మూడు మండలాల పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సిన అతి ప్రధానమైన పైడిగాం ప్రాజెక్టు ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన చతికిలబడిందన్నారు. ఇప్పటికై నా దీన్ని అభివృద్ధి చేసి వేలాది మంది రైతుల సంక్షేమానికి తోడ్పడాలని కోరారు. ఎనిమిదేళ్ల క్రితం తితిలీ తుఫాను ధాటికి ఈ ప్రాజెక్టు గోడలు పూర్తిగా దెబ్బతినడం, తదితర సమస్యలతో కునారిల్లుతోందని లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయాల్సిందిగా విన్నవించారు.
పైడిగాం ప్రాజెక్టు పరిధిలో సోంపేట మండలంలోని పలాసపురం గ్రామమే శివారు గ్రామం. ఇక్కడ వరకు నీరు రావడం గగనమే. ఈ గ్రామంలో పొలాలను టైల్యాండ్‌గా ప్రాజెక్టులో గుర్తించారు. నీరు సక్రమంగా అందకపోయినా రెవెన్యూ వారు మాత్రం భూమి శిస్తులను పక్కాగా వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు అల్లాడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికై నా పైడిగాం ప్రాజెక్టు పరిధిలో శివారు ప్రాంతం వరకు నీరందేలా చర్యలు చేపట్టాలి.
– తడక జోగారావు,
పలాసపురం, సోంపేట మండలం
మూడు మండలాల రైతులకు సాగునీరందించేందుకు ఉద్ధేశించి దివంగత గన్ని పద్మనాభరావు పోరాటంతో నిర్మాణానికి నోచుకొన్న పైడిగాం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్టు పూర్తిగా కునారిల్లిన పరిస్థితికి చేరుకోవడంతో, ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరందక ఆందోళన చెందుతున్నారు. పంటలకు గ్యారెంటీ లేని వైనం. దీనిపై అధ్యయనం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలి.
– గన్ని అశోక్‌కుమార్,
దివంగత పద్మనాభరావు కుమారుడు, సోంపేట
పైడిగాం ప్రాజెక్టు మెయిన్ కెనాల్‌కు ఆనుకొని ఉన్న పంట పొలాలకు సాగునీటి సమస్య తప్పడం లేదు. ప్రతిఏటా ఈ చానల్ కింద ఉన్న పంట పొలాలకు సాగునీరు అందడంలో ఎన్నో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కాలువలో చివరి వరకు సిమెంటు లైనింగ్ నిర్మించకపోవడంతో ప్రవహిస్తున్న నీరు ఎక్కడికక్కడే ఇంకిపోవడం, దారి పొడవునా గుర్రపుడెక్క ఏర్పడటంతో నీరందని పరిస్థితి. ఇప్పటికై నా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టాలి.
– మడ్డు వెంకటరావు,
బూరగాం, కంచిలి మండలం
పైడిగాంపై నిర్లక్ష్యమేలా..?
పైడిగాంపై నిర్లక్ష్యమేలా..?
పైడిగాంపై నిర్లక్ష్యమేలా..?
పైడిగాంపై నిర్లక్ష్యమేలా..?
పైడిగాంపై నిర్లక్ష్యమేలా..?
పైడిగాంపై నిర్లక్ష్యమేలా..?


