రీవర్రీఫికేషన్..!
● కొనసాగుతున్న సదరం పునః పరిశీలన ● ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు ● ఆందోళన చెందుతున్న దివ్యాంగులు
నరసన్నపేట:
సదరం సర్టిఫికెట్స్ పునః పరిశీలన నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో ప్రహాసనంగా కొనసాగుతోంది. దివ్యాంగులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆపసోపాలు పడుతున్నారు. ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్నా.. ఇలా ఎన్నిసార్లు వెరిఫికేషన్ పేరిట ఆస్పత్రుల చుట్టూ తిప్పుతారని వాపోతున్నారు. దివ్వాంగ పింఛన్లు అనర్హులు పొందుతున్నారని అపోహలు పెట్టుకున్న కూటమి ప్రభుత్వం, దివ్వాంగుల సర్టిఫికెట్స్‌ను ఈ ఏడాది ప్రారంభం నుంచి మే నెల వరకు తనిఖీలు నిర్వహించింది. అప్పుడు అర్హులైన పింఛనుదారులు నానా అవస్థలు పడి తనిఖీలకు వచ్చారు. అనర్హుల ఏరివేత పేరిట అర్హులను కూడా తొలగించడంతో వీరందరూ తమకు పింఛన్ పునరుద్ధరించాలని ఎంపీడీవో కార్యాలయాలకు దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం మరలా రీ వెరిఫికేషన్ చేయిస్తోంది. దీనిలో భాగంగా నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో మంగళ, బుధ, గురువారాల్లో దివ్వాంగుల అంగ వైకల్యాన్ని వైద్యులు పరిశీలించి సదరం సర్టిఫికెట్స్ మంజూరు చేస్తున్నారు. దీంతో దివ్వాంగులు వివిధ ప్రాంతాల నుంచి నరసన్నపేటకు వస్తున్నారు. బుధవారం ఈ ఆస్పత్రికి హిరమండలం, పోలాకి, ఎల్‌ఎన్‌పేట మండలాల నుంచి 50 మంది వచ్చారు. వీరందరినీ ఆర్థో వైద్యుడు రమణరావు పరిశీలించారు.


