క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి
ఎచ్చెర్ల: విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకొని ముందుకు సాగాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. మండలంలో కుశాలపురంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గడిచిన మూడు రోజుల నుంచి జరుగుతున్న ప్రాంతీయ స్థాయి అంతర్ పాలిటెక్నికల్ క్రీడల ఆటల పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. విజేతలు వీరే..
ఓవరాల్ చాంపియన్ షిప్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం (బాలికలు), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం (బాలురు)కు వచ్చింది. వ్యక్తిగత చాంపియన్ షిప్ శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన కె.శివరామకృష్ణ, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన బి.సోనియాకు లభించాయి. వాలీబాల్ పోటీల్లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం ప్రథమ, శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల ఎచ్చెర్లకు ద్వితీయ స్థానం లభించింది. వాలీబాల్ బాలుర విభాగంలో శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల ఎచ్చెర్ల ప్రథమ స్థానం, టెక్కలి ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలకు ద్వితీయ స్థానం లభించాయి. ఖో–ఖో పోటీల్లో బాలికల విభాగంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళంకు ప్రథమ స్థానం, శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలకు ద్వితీయ స్థానం లభించాయి. కబడ్డీ బాలుర విభాగంలో ఆదిత్య పాలిటెక్నిక్ టెక్కలి ప్రథమ స్థానంలో, శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకులు వి.పద్మారావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాస్స్ పాల్గొన్నారు.


