
తప్పిన పెను ప్రమాదం
పొందూరు : మండల కేంద్రంలోని పొందూరులో మానసవేణి పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో శుక్రవారం ప్రమాదానికి గురైంది. 20 మందికి పైగా విద్యార్థులను ఎక్కించడంతో ఒరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. బోల్తా కొట్టుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అంటున్నారు.
పుస్తెలతాడు చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం నరసాపురం జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం ఓ మహిళ మెడలో పుస్తెలతాడును దుండగులు తెంచుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలం బడేకుప్పన్నపేటకు చెందిన బొమ్మాళి దాలమ్మ కోటబొమ్మాళిలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ వస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు తెంచుకుని పరారయ్యారు. బాధితురాలు కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
20 కేజీల గంజాయి స్వాధీనం
పలాస: ఒడిశాకు చెందిన నలుగురు గంజాయి అక్రమ రవాణాదారులను పలాస రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. నిందితులు మోహనా బ్లాక్ పడొవ గ్రామానికి చెందిన అనిసెంటు నాయక్ , రాహిత్ బిర, జునైలు, గుమ్మా గ్రామానికి చెందిన సురుసింగ్‌గా గుర్తించామని, వీరి వద్ద 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరిని అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకు పంపించామన్నారు.

తప్పిన పెను ప్రమాదం