
కంది.. అందేనా..?
● రేషన్ షాపుల్లో పంపిణీ నిల్
● ఎక్కడా సరఫరా కాని వైనం
పప్పు సరఫరా చేయాలి
ఎన్నికల ముందు అన్ని సరుకులు రేషన్ షాపుల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. మా లాంటి పేదలకు అవసరమైన కందిపప్పు సరఫరా చేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలి.
– దీర్ఘాశి చిన్నమ్మడు, పాతహిరమండలం
కంది పప్పు లేదట
రేషన్ షాపుల్లో బియ్యం,చక్కెర మాత్రమే ఇస్తున్నారు. కందిపప్పు అడిగితే ప్రభుత్వం నుంచి రాలేదని డీలర్లు చెబుతున్నారు. గతంలో రేషన్ షాపులలో రూ.70 లకే కందిపప్పు ఇచ్చేవారు.
– గులివిందల లలిత, తంప గ్రామం
హిరమండలం:
రేషన్ దుకాణాల్లో కందిపప్పు ఇవ్వడం మానేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా కందిపప్పు సరఫరాను పునరుద్ధరించలేదు. గత ప్రభుత్వ హయాంలో నిరంతరం కందిపప్పు పంపిణీ జరిగేదని, అయితే ప్రస్తుతం ప్రభు త్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలు మాత్రమే ఇచ్చిందని, ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1603 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వాటి పరిధిలో 6,57,758 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 19,60,651 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరంతా ప్రతి నెలా రేషన్ షాపుల్లో ఇచ్చే కందిపప్పు కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కందిపప్పు గురించి సమాధానం చెప్పేవారే కరువైపోయారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.120 నుంచి రూ.140 వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల తక్కువ ధరకు విక్రయిస్తున్నా.. రేషన్ పంపిణీలో భాగంగా ఇస్తే తమకు అనుకూలంగా ఉంటుందని కార్డుదారులు కోరుతున్నారు.

కంది.. అందేనా..?

కంది.. అందేనా..?