
ఇంత నీచానికి దిగజారుతారా..?
● ఆమదాలవలస ఎమ్మెల్యే
కూన రవికుమార్ వైఖరిపై వైఎస్సార్‌సీపీ నేత
చింతాడ మండిపాటు
● కూన బాధితురాలు సౌమ్యకు పరామర్శ
● బాధితులకు వైఎస్సార్ సీపీ
అండగా ఉంటుందని భరోసా
ఆమదాలవలస:
పొందూరు కేజీబీవీ ఎస్‌ఓ (ప్రిన్సిపాల్) సౌమ్యను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధించడం సబబు కాదని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో ఉన్న ఆమె గృహానికి వెళ్లి పరామర్శించారు. కూన రవికుమార్ చేసిన దాష్టీకాలను ఆమె చెప్పుకున్నారని, ఎంత నరకం చూడకపోతే ఇలా బయటకు వచ్చి చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 11.30 గంటల వరకు ఆఫీస్‌లో ఉంచడం, రాత్రి సమయంలో వీడియో కాల్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఎమ్మెల్యేకు ఏం ఉందని ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేస్తే కూనకు తగిన బుద్ధి చెబుతామన్నారు. వైఎస్సార్ సీపీ మొత్తం ఉద్యోగినికి అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి ఆమెకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. గతంలో కూడా కూన రవికుమార్‌పై ఇలాంటి అభియోగాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆయన కోరుకున్నది జరగకపోతే ఉద్యోగులను బదిలీలు చేసే కూన నీచ బుద్ధికి సాక్ష్యాలు ఉన్నాయన్నారు.