‘ముద్దు’ల ముచ్చట.. ‘కూన’ నైట్‌ కాలింగ్‌..! | Aamdalavalasa MLA harasses KGBV principal in Srikakulam | Sakshi
Sakshi News home page

‘ముద్దు’ల ముచ్చట.. ‘కూన’ నైట్‌ కాలింగ్‌..!

Aug 16 2025 5:28 AM | Updated on Aug 16 2025 5:31 AM

Aamdalavalasa MLA harasses KGBV principal in Srikakulam

టీడీపీ ఎమ్మెల్యేల లీలలు.. 

శ్రీకాకుళంలో కేజీబీవీ ప్రిన్సిపాల్‌కు ఆమదాలవలస ఎమ్మెల్యే వేధింపులు

వీడియో కాల్‌ చేయాలని మహిళా ఉద్యోగులకు హెచ్చరికలు.. 

మాట వినకుంటే బదిలీ వేటు

కలకలం రేపిన గుంటూరు ఈస్ట్‌ టీడీపీ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ ‘ముద్దు’ వీడియో

ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగిన పార్టీ మహిళా నేత..

ఈ పోలీసోళ్లతో నాకు న్యాయం జరగదు! 

కళ్యాణదుర్గంలో నిండు గర్భిణి శ్రావణి బలవన్మరణం

టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఫిర్యాదును మార్చేశారని కన్నీరు.. 

మృతురాలి ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌..

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం పట్నం బజారు  (గుంటూరు), కళ్యాణదుర్గం: దేశమంతా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటున్న వేళ.. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించి ప్రవర్తిస్తుండటంతో మహిళలు రక్షణ కరువై అల్లాడుతున్నారు. పైశాచిక వేధింపులతో గుండె బరువై రాలిపోతున్నారు. బాధ్యత మరిచిన టీడీపీ ప్రజాప్రతినిధుల విశృంఖల వైఖరితో మహిళలు బెంబేలెత్తుతున్నారు. కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతోంది. విద్యాధికులైన మహిళలను సైతం కామ పిశాచాలు వేధిస్తుంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కళ్లు మూసుకుని కూర్చున్నారు! 

కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆగడాలు మితిమీరిపోవడంతో మహిళా ఉద్యోగు­లు కార్యాలయాలకు రావాలంటే వణికి­పోతున్నారు. రాత్రిపూట పార్టీ కార్యాల­యాలకు పిలుస్తూ.. వీడియో కాల్స్‌ చేసి వేధింపులకు దిగుతున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన అఘాయి­త్యాలు.. గుంటూరు ఎమ్మెల్యే ‘ముద్దు’ వీడియోలు మహిళల పట్ల ఏడాది పాలనలో జరుగుతున్న దుశ్చర్యలకు మచ్చు తునకగా నిలుస్తున్నాయి. 

‘కూన’ వీడియో కాల్స్‌...!
‘ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమా ర్‌ రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాల­యాలకు రా­వా­లని తన అనుచ­రులతో పిలిపిస్తారు. చా­లాసేపు అక్కడే ఉంచుతారు. రాత్రి 10.30 దాటిన తర్వాత వీడియో కాల్‌ చేసి వేధిస్తుంటాడు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. సాధారణ కాల్స్‌ చేయరు. వీడియో కాల్‌ అయితేనే మాట్లాడతారని అనుచరులతో చెప్పిస్తారు. దుర్బుద్ధి­తోనే ఇదంతా... దారికి రాలేదని వేధింపులకు గురి చేస్తున్నారు. నాలా నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలను కున్నా...!’

టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వేధింపులు ఎదుర్కొన్న పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌ సౌమ్య ఆవేదన ఇదీ! దళితురాలిని తీవ్రంగా వేధించారంటూ బాధితు­రాలు కన్నీరు మున్నీరవుతున్నారు. కూన రవికుమార్‌ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఇద్దరు మనుషులను పంపించి కేజీబీవీలోని టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందితో తనకు వ్యతిరేకంగా బలవంతంగా సంతకాలు చేయించినట్లు తెలిపారు. అధికారులు తనకు అండగా ఉండకపోగా ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నా­రని వాపోయారు. కాగా గార, కంచిలి కేజీబీవీల ప్రిన్సిపాళ్లపై కూడా వ్యూహాత్మకంగా ఫిర్యాదులు చేయించి బదిలీలు చేయించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

బలిపశువుని చేస్తున్నారు..!
గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్‌ అహ్మద్‌ ‘ముద్దు’ దృశ్యాల వీడియో వైరల్‌ అయిన ఘటనలో తనని బలిపశువుని చేస్తు­న్నా­రంటూ పార్టీ మహిళా నేత షేక్‌ సూఫియా పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఎమ్మెల్యే, పోలీసుల వేధింపులు తట్టుకోలేక­పోతు­న్నా­నంటూ శుక్రవారం ఆమె గుంటూరు బ్రహ్మా­నందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహ­త్యా­యత్నం చేయడంతో కు­టుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పా­ర్టీ నాయకు­రాలు గుడిపల్లి వాణితో ఎమ్మెల్యే వి­వా­హేతర సంబంధం గురించి ప్రతి ఒక్కరికీ తె­లుసని సూఫియా మీడియాతో పేర్కొన్నారు. 

ఎమ్మె­ల్యే­తో సన్నిహి­తంగా ఉన్న వీడియోలను ఆమె భర్త నవీన్‌కృష్ణ స్వయంగా రికార్డ్‌ చేసి వైరల్‌ చేశారని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే నసీర్‌కు చెప్పడంతో రెండు రోజులు మాట్లాడ­కుండా ఉండమన్నారని చెప్పారు. గుడిపల్లి వాణి కుటుంబంతో ఎమ్మెల్యే సెటిల్‌­మెంట్‌ చేసుకుని తనని ఇరికించే యత్నం చేస్తున్నారని చెప్పారు. నవీన్‌కృష్ణ ఫోన్‌లో ఉన్న వీడియోలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకపో­తున్నానని, తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. 

కళ్యాణదుర్గంలో గర్భిణి బలవన్మరణం..
‘భర్త, అత్త మామల వేధింపులు తాళలేక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగ­లేదు. నా ఫిర్యాదును పోలీసోళ్లు మార్చేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నాకు అన్యాయం చేశారు..’ అని విలపిస్తూ అనంతపురం జిల్లా కళ్యా­ణదుర్గం పట్టణానికి చెందిన నిండు గర్భిణి శ్రావ­ణి (22) ఉరి పోసుకుని బలవన్మరణానికి పాల్ప­డింది. తన దయనీయ పరిస్థితిని ఫోన్‌లో ఆడియో రికార్డ్‌ చేసి తనువు చాలించింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకోగా... శుక్రవారం ఉదయం మృతురాలి ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  

ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదా..?
కళ్యాణదుర్గానికే చెందిన శ్రీనివాసులుతో మూడేళ్ల క్రితం శ్రావణికి వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త,అత్త మా­మలు తరచూ వేధించడంతో కళ్యాణదుర్గం పోలీస్లకు ఫిర్యాదు చేసినట్లు శ్రావణి పేర్కొంది. స్థానిక టీడీపీ నేత, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వైపీ రమేష్, మాజీ వైస్‌ చైర్మన్‌ శర్మస్‌ వలి ఒత్తిళ్లతో సీఐ దీన్ని మరో ర­కంగా మార్చేసి భర్త, అత్తమా మ­లకు అనుకూలంగా వ్యవహరించా­­రని ఆడియోలో మృతురాలు కన్నీ­రు మున్నీరైంది. 

కడుపులో పెరు­గుతున్న బిడ్డతో పాటు తాను ఈ లోకం నుంచి వెళ్లిపో­తున్నామని, కనీసం తన మొదటి బిడ్డకైనా (రెండేళ్ల చిన్నారి) న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ప్రభుత్వంలో ఇక న్యా­యం జరగదా? అని ఆక్రోశించింది. ఈమేరకు ఫోన్‌లో వాయిస్‌ రికార్డ్‌ చేసి పుట్టింట్లో ఉరేసుకుని తనువు చా­లించింది. దీనిపై పట్టణ సీఐ యువ­రాజును వివరణ కోరగా.. మృతురాలు ఆరోపించిన­ట్లుగా తాము నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement