ప్రహసనంగా పదోన్నతుల కౌన్సెలింగ్
● 83 హెచ్‌ఎం పోస్టులను ఎస్‌ఏలతో భర్తీ చేసేందుకు నిర్ణయం ● ఉదయం పిలిచి సాయంత్రం మొదలుపెట్టిన ప్రక్రియ ● కూటమి ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడిన ఉపాధ్యాయులు
శ్రీకాకుళం న్యూకాలనీ:
కూటమి ప్రభుత్వం విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనువనువునా వారిని అవమానించేలా వ్యవహరిస్తోంది. తాజాగా గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా ప్రధానోపాధ్యాయులు పదోన్నతుల కౌన్సెలింగ్ పేరిట ఉదయం పిలిచి, సాయంత్రం వరకు మొదలుపెట్టకపోవడంతో వారు అల్లాడిపోయారు. తమ పట్ల ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే..!
జిల్లా పరిషత్‌లో 80, మున్సిపల్ 2, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకటి కలిపి మొత్తం 83 ప్రధానోపాధ్యాయుల ఖాళీ పోస్టులను అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరి ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సీనియారిటీ జాబితాను తయారుచేసి, అభ్యంతరాలను స్వీకరించి, ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాను రూపొందించారు. 1:2 నిష్పత్తిలో 166 మంది ఉపాధ్యాయుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ రిజిష్టర్లను ఈనెల 27న డీఈఓ నేతృత్వంలో వెరిఫికేషన్ చేశారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకని చెబుతూ.. శుక్రవారం పదోన్నతల కౌన్సెలింగ్ కోసం ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్దకు చేరుకోవాలని డీఈఓ తిరుమల చైతన్య సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు.
సాయంత్రం వరకు నిరీక్షణ..
ఉదయమే పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు వేచి ఉండక తప్పలేదు. ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యల పేరిట సాయంత్రం వరకు నిరీక్షించేలా చేశారు. ఈ మధ్యలో పలు సూచనలు పేరిట డీఈఓ, ఇతర అధికారులు కాలక్షేపం చేస్తూ వచ్చారు. కనీసం భోజనం చేసేందుకు కూడా అర్ధగంట సమయం ఇవ్వకుండా పాఠశాలకే వారిని పరిమితం చేయడంతో ఆకలితో తల్లడిల్లిపోయారు. ఎట్టకేలకు సాయంత్రం 6 గంటల తర్వాత మొదలైన ఈ పదోన్నతి కౌన్సెలింగ్ ప్రక్రియ రాత్రి 9.15 వరకు కొనసాగింది. ఆన్‌లైన్‌లో చేపట్టాల్సిన పదోన్నతి కౌన్సెలింగ్‌ను మాన్యువల్‌గా చేపట్టారు. అధికారులు తీరుపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉదయం పిలిచి రాత్రి 9 వరకు తమను నాలుగు గోడలకు పరిమితం చేసి, వేధించడం ఎంతమాత్రం తగదని మహిళా ఉపాధ్యాయినులు ఆక్రోశం వెల్లగక్కారు. కాగా, 83 హెచ్‌ఎం ఖాళీ పోస్టులకు కౌన్సెలింగ్ చేపట్టి, నియామక ఉత్తర్వులు ఆన్‌లైన్‌లో చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డీవైఈఓ ఆర్.విజయకుమారి, జి.రాజేంద్రప్రసాద్, పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రహసనంగా పదోన్నతుల కౌన్సెలింగ్


