
తాగునీరు రాదు
దారి లేదు..
తాగేందుకు నీరులేదు
గోటితో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకున్నట్లు అధికారుల సమన్వయ లోపంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో నాలుగు రోజులుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడటమే కాకుండా, సమీప ప్రాంత ప్రజలు తాగేందుకు నీరు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
– సత్తారు సత్యం, గోపినాథపురం
ఇబ్బంది పడుతున్నారు
రహదారి మరమ్మతుల్లో భాగంగా పైపులైన్లు తవ్వేయడంతో నేటికి నాలుగు రోజులుగా కుళాయిలు ద్వారా తాగునీరు రావడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తాగేందుకు నీటిని కోనుగోలు చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పనులు వేగవంతం చేయాలి.
– తమ్మన్నగారి కిరణ్,
రోణంకి అప్పలస్వామి వీధి, టెక్కలి
సమస్య పరిష్కరిస్తాం
రహదారి మరమ్మతులతో ప్రజలకు ఏర్పడిన సమస్యను పరిష్కరించారు. మంగళవారం రాత్రిలోపు మరమ్మతులు పూర్తిచేసి బుధవారానికి రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తాం.
– మోహన్, జేఈ, టెక్కలి
● ప్రజలకు శాపంగా అధికారుల సమన్వయ లోపం
● నాలుగు రోజులైనా పూర్తవ్వని రోడ్డు పనులు
● ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు
టెక్కలి రూరల్: నాలుగు రోజుల క్రితం స్థానిక గోపినాథపురం సమీపంలో రహదారి మధ్యలో ఏర్పడిన రంద్రాన్ని పూడ్చేందుకు నిర్వహించిన పనుల్లో సంబంధిత అధికారులు మధ్య ఏర్పడిన సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారింది. రహదారి మరమ్మతుల్లో భాగంగా రహదారి కింద ఉన్న పైపులైన్లను తొలగించారు. దీంతో అధికంగా తాగునీరు వృథాగా పోయిన విషయం తెలిసిందే. అయితే అధికారులు పైపులైన్లు మరమ్మతులు చేసేందుకు గాను రాకపోకలు నిలిపివేసి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఆ పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ విషయం...
గోపినాథపురం సమీపంలో రోడ్డు మధ్యలో చిన్నపాటి రంద్రం ఏర్పడింది. అయితే ఆ రంద్రం మరమ్మత్తులు చేసేందుకు పోర్టుకు సంబంధించిన సిబ్బంది స్థానిక అధికారులతో చర్చించకుండా రహదారిని జేసీబీ సాయంతో తవ్వేశారు. దీంతో కింద నుంచి వెళ్తున్న ప్రధాన పైపులైన్లతో పాటుగా పంచాయతీ పైపులైన్లు సైతం మరమ్మతులకు గురవ్వడంతో ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు.
తాగునీటి కష్టాలు
రహదారి పనుల్లో భాగంగా రోడ్డు కింద నుంచి వెళ్తున్న పైపులైన్లు తవ్వేయడంతో అటు పంచాయతీ, ఇటు ఆర్‌డబ్ల్యూఎస్‌కి సంబంధించిన రెండు పైపులైన్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో నాలుగు రోజులుగా ప్రజలకు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా గోపినాథపురం, ఆర్డీవో కార్యాలయం సమీప ప్రాంతాలు, బర్మాకాలనీ, జయకృష్ణపురం, మునసబుపేట, చిన్ననారాయణపురం, ధర్మానీలాపురం, రావివలస, బీసీ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నిలిచిన రాకపోకలు
మరమ్మతుల్లో భాగంగా రహదారి మొత్తం తవ్వేయడం వలన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గం గుండా రాత్రి, పగలు వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. అలాంటి ఈ మార్గంలో నాలుగు రోజులుగా రాకపోకలు నిలిపి వేయడంతో వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టెక్కలి నుంచి సంతబొమ్మాళి, నౌపడ, నౌపడ ఆర్‌ఎస్, మూలపేట, పూండీ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఈ మార్గంలో బస్సు సౌకర్యం నిలిపివేయడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. మిగిలిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు సమీపంలోని చెరువు గట్టుమీదుగా ప్రమాదకరంగా నడుపుతున్నారు.

తాగునీరు రాదు

తాగునీరు రాదు

తాగునీరు రాదు

తాగునీరు రాదు