ముగిసిన ఐటీఐ దరఖాస్తుల స్వీకరణ
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని మూడు ప్రభుత్వ, 20 ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 24తో ముగిసింది. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఉన్నతాధికారుల సూచనలు మేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్ సిద్ధం చేస్తామని ప్రవేశాల కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్ ఆదివారం చెప్పారు. మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా పారదర్శకంగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.
మత్స్యకారుడు మృతి
పోలాకి: మండలంలోని రాజారాంపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు దౌలపల్లి గురుమూర్తి(52) వేటకు వెళ్లి మృతిచెందాడు. ఉప్పుగెడ్డ సంగమంలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామానికి ఆనుకుని ఉన్న వంశధార నదిలోకి ఆదివారం వేకువజామున వేటకు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సీఐ ఎం.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


