పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తి
ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ పీజీసెట్ – 2025 దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగింది. ఏపీ పీజీసెట్ ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 31 నుంచి దరఖాస్తులు స్వీకరణ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
సాహితీమూర్తి పులఖండం
గార: గొప్ప సాహితీమూర్తి డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు అని గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు అన్నారు. ఆదివారం గార మండలం వాడాడ జంక్షన్‌లోని కల్యాణ మండపంలో విద్వాన్ బంకుపల్లి రమేష్‌శర్మ అధ్యక్షతన జరిగిన పులఖండం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి మనమధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఐఎస్‌వో, నాక్ వంటి సంస్థల గుర్తింపు వెనుక ఆయన కృషి ఉందన్నారు. అనంతరం కరస్పాండెంట్ రంగారావు, వైస్ ప్రిన్సిపాల్ కె.వి.సత్యనారాయణ, డాక్టర్ ఎం.కృష్ణ, విశ్రాంత డీఎస్పీ భార్గవరావునాయుడు, డాక్టర్ డి.విష్ణుమూర్తి, మేజర్ వంగ మహేష్, ఉపనిషన్మందిరం కార్యదర్శి నిష్టల నరసింహమూర్తి మాట్లాడుతూ పులఖండంతో గల అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గురజాడ సంస్థల ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు
విఘాతం కలిగిస్తే చర్యలు
శ్రీకాకుళం క్రైమ్ : నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న పాత నేరస్థులు, సస్పెక్ట్ షీటర్లకు వివిధ పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతుండటంతో పాటు పేకాట శిబిరాలు ఎక్కడ పడితే అక్కడ నడుస్తుండటంతో వారం వ్యవధిలో రెండోసారి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఎస్పీ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ దాడులు సైతం ముమ్మరం అయ్యాయి. జిల్లాకేంద్రంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ పైడపునాయుడు షీటర్లకు అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
సేవలు మరింత
విస్తృతం చేయాలి
శ్రీకాకుళం కల్చరల్: సత్యసాయి సంస్థల సేవలు మరింత విస్తృతం కావాలని రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు కోరారు. జిల్లా కేంద్రంలోని బ్యాంకర్స్ కాలనీలో సత్యసాయి మందిరంలో జిల్లా స్థాయి సత్యసాయి సేవా సంస్థల పదాధికారులు, కన్వీనర్లతో ఆదివారం సమావేశం నిర్వహించారు. నారాయణసేవ, గ్రామ సేవా మహాయజ్ఞం, కోటి మొక్కల పెంపకం, రిమ్స్, టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రులలో నిర్వహిస్తున్న నిత్య నారాయణ సేవలపై సమీక్షించారు. కార్యక్రమంలో సమితి, భజన మండలి కన్వీనర్లు, సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పేకాట శిబిరంపై దాడి
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కిల్లిపాలెంలో ఆదివారం ఓ గృహంలో పేకాడుతున్న ఆరుగురిని శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.79,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నాలుగు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు కుడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలో ఇటీవల కాలంలో పేకాట, బెట్టింగ్ వంటి వ్యవహారాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. రూరల్ పోలీసులు మాత్రం వీటిపై నోరు మెదపడం లేదు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముందస్తుగా సమాచారం సేకరించడంతో పాటు నేరస్తుల కదలికలు పసిగట్టడం, పేకాడుతున్న వారిని పట్టుకోవడంలో దూకుడుగా ఉంటున్నారు. రూరల్ పోలీసులు మాత్రం ఇటువంటి కేసుల్లో చాలా గోప్యత పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఆదివారం పేకాటరాయుళ్లు పట్టుబడిన విషయమై రూరల్ ఎస్‌ఐ వద్ద ప్రస్తావించగా అటువంటి కేసులు ఏమీ నమోదు కాలేదని, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెళ్లారని, వారు పట్టుకొని వస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తి
పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తి


